
బీసీల హక్కుల సాధనకు ఐక్యంగా కదలాలి*
*బీసీల హక్కుల సాధనకు ఐక్యంగా కదలాలి*
-బీసీ జేఏసీ జిల్లా చైర్‌పర్సన్ దాసరి ఉష
రేపు బీసీల ఆత్మీయ సమావేశం
ముఖ్య అతిథిగా హాజరుకానున్న జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
పెద్దపల్లి,జూన్ 28:(ప్రజాకలం జిల్లాప్రతినిధి)
దేశ, రాష్ట్ర రాజకీయాల్లో వెనుకబడిన తరగతుల హక్కుల సాధన, భవిష్యత్ కార్యాచరణే ధ్యేయంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీసీల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు బీసీ జేఏసీ జిల్లా చైర్‌పర్సన్ శ్రీమతి దాసరి ఉష వెల్లడించారు.జూన్ 29న ఉదయం 11గంటలకు స్థానిక ఆర్యవైశ్య భవనంలో జరిగే ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆమె తెలిపారు.ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆమె ఈ వివరాలను వెల్లడించారు.ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడుతూ సమాజంలో,దేశ జనాభాలో 65 శాతానికి పైగా ఉన్న బీసీలకు అన్ని రాజకీయ పార్టీల్లోనూ తగిన ప్రాధాన్యత దక్కడం లేదని,నిరంతరం చిన్నచూపుకే గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బీసీలంతా రాజకీయాలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి తమ సామాజిక, రాజకీయ సత్తాను చాటాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. చదువుకున్న బీసీ యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కాలన్నారు.రిజర్వేషన్లు సమర్థవంతంగా అమలు కావాలన్నా ఐక్య పోరాటాలే శరణ్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ వర్గాలకు రక్షణగా ఉన్న చట్టాల తరహాలో బీసీల రక్షణకు ఎలాంటి నిర్దిష్ట చట్టాలు లేకపోవడం వల్లే అగ్రవర్ణాల దాడులు,అగాయిత్యాలు విపరీతంగా పెరుగుతున్నాయని శ్రీమతి ఉష ఆందోళన వ్యక్తం చేశారు.ఇటీవల నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాల్లో బీసీలపై జరిగిన అమానవీయ ఘటనలే ఇందుకు నిదర్శనమని గుర్తుచేశారు.ఈ రకమైన అణచివేతను అడ్డుకోవడానికి, హక్కుల సాధనకు పెద్దపల్లి వేదికగా జరిగే ఈ సమావేశం ఒక దిక్సూచిగా మారుతుందన్నారు.బీసీల ఐక్యత,సంస్థాగత బలోపేతం, ప్రాంతీయ సమస్యల పరిష్కారమే అజెండాగా సాగే ఈ ఆత్మీయ సమావేశానికి జిల్లాలోని బీసీ సంఘాల నాయకులు,ప్రజాప్రతినిధులు, మేధావులు,యువతీ యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.స్థానిక సమస్యలను జాతీయ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లి,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు.ఈ మీడియా సమావేశంలో బీసీ జేఏసీ జిల్లా వైస్ చైర్మన్ కొండి సతీష్, వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి శంకర్,ముఖ్య నాయకులు బిక్షపతి,కె.రమేష్,కలవేణి రవి,ఆసరి రాజయ్య,అబ్దుల్ మాలిక్,శ్రావణ్, అజీమ్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

