
పాఠశాల భవనాల నిర్మాణం పూర్తయ్యేది ఎప్పుడో…
పాఠశాల భవనాల నిర్మాణం పూర్తయ్యేది ఎప్పుడో…
*రెండేళ్లయిన పూర్తికాని వైనం…
*ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు.
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జులై 01(ప్రజా కలం)ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోకపోవడంతో విద్యార్థుల చదువులు ప్రశ్నార్థకంగా మారాయి.మెట్పల్లి పట్టణంలోని చావిడి ప్రాంతంలో బాలికల ఉన్నత, ఉర్దూ మీడియం పాఠశాలల భవనాలు తొలగించి రెండేళ్లకుపైగా గడిచినా నూతన భవన నిర్మాణ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. గత నెల 12 నుంచి బడులు తెరచుకోగా గదులు అందుబాటులో లేక విద్యార్థులు అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. 6 నుంచి 10వ తరగతి వరకు పిల్లలు ఉన్న ఉర్దూ మీడియం పాఠశాల భవనాలను పూర్తిగా తొలగించారు.గత విద్యాసంవత్సరంలో పది పరీక్షల్లో 96 శాతం ఫలితాలు సాధించారు. బాలికల ఉన్నత పాఠశాలలో గతంలో 252 మంది విద్యార్థులు చదువుకున్నారు. పదో తరగతిలో 92 శాతం ఫలితాలు సాధించి ఆదర్శంగా నిలిచారు. కానీ సొంత భవనం లేకపోవడంతో ఇప్పుడు ఆ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

నిధులు మంజూరైన పనులు పూర్తి కాలేదు..
రెండు పాఠశాలలకు మన బస్తీ-మనబడి పథకం కింద ప్రభుత్వం నూతన భవనాల నిర్మాణానికి రూ.75 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది. 2022 డిసెంబరులో భూమిపూజ చేసి కొన్ని నెలల పాటు పనులు కొనసాగాయి.బిల్లులు రాకపోవడంతో గుత్తేదారు పనులను మధ్యలోనే నిలిపివేశారు. ఉన్న గదులను తొలగించి.. భవనం స్లాబ్ వేసి వదిలేశారు. పాఠశాలకు సంబంధించిన రెండు గదులు, బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన ఒక గదిలో విద్యార్థులకు మొన్నటి వరకు విద్యాభోదన చేశారు. ఆయా బడుల్లో 8 తరగతి గదులు, 2 డైనింగ్ హాల్, మూత్రశాలలు నిర్మించాల్సి ఉంది. భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో విద్యార్థులు ఇరుకు గదులలో ఇబ్బందులు పడుతూ చదువుకున్న సాగిస్తున్నారు. ఇప్పటికైనా భవన నిర్మాణం పూర్తి చేసి విద్యార్థుల ఇబ్బందులు తొలగించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

