సమాజ సేవలో అగ్రగామి ఈనాడు

సమాజ సేవలో అగ్రగామి ఈనాడు

– జలగం నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనానికి శంకుస్థాపన
– రూ.2 కోట్ల అంచనా వ్యయంతో ఈనాడు సహాయనిధి ఆధ్వర్యంలో నిర్మాణం.
పాలేరు సెప్టెంబర్( 29 ప్రజా కలం న్యూస్)
(ఖమ్మం జిల్లా ప్రజా కలం ప్రతినిధి రాయబారపు రమేష్)
పాలేరు సోమవారం ఏదులాపురం మున్సిపాలిటీ జలగం నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవన నిర్మాణానికి సోమవారం లెక్చరర్స్ కాలనీలో శంకుస్థాపన జరిగింది. మున్నేరు వరదలతో పాడైన పాఠశాల భవనం స్థానంలో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో ఈనాడు సహాయనిధి ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ కొత్త భవనానికి తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి కలిసి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ శ్రీజ, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస రెడ్డి, ఈనాడు యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ. ఈనాడు కేవలం పత్రిక మాత్రమే కాదని, సమాజానికి అండగా నిలిచే శక్తిగా నిలుస్తోందని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో ఎక్కడైనా విపత్తు సంభవించిన వెంటనే ఈనాడు సహాయనిధి ద్వారా బాధితులను ఆదుకోవడం, అవసరమైన చోట సాయం అందించడం వారి ప్రత్యేకత అని గుర్తు చేశారు. మున్నేరు వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న ఈ పాఠశాల కోసం కేవలం 13 నెలల్లోపే రూ.2 కోట్ల వ్యయంతో కొత్త భవనం నిర్మించడానికి ముందుకు రావడం వారి సేవా తపనకు నిదర్శనమని కొనియాడారు.
ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల కోసం కట్టుబడి పనిచేస్తుందని, అయితే ప్రభుత్వంతో పాటు సమాజం నుండి కూడా ఇలాంటి సేవా దృక్పథం అవసరమని మంత్రి పేర్కొన్నారు. ఈనాడు యాజమాన్యం చూపుతున్న ఉదాత్తత, సిబ్బంది అంకితభావం ప్రశంసనీయమని, సమాజంలో ఇలాంటి ఆలోచన మరింత విస్తరించాలని అభిప్రాయపడ్డారు. భూకంపం, వరద, అగ్నిప్రమాదం వంటి విపత్తుల సందర్భంలో ఈనాడు సహాయనిధి ద్వారా వెంటనే ముందుకు వచ్చి బాధితులకు అండగా నిలవడం వారి సేవాతత్పరతకు నిదర్శనమని పేర్కొన్నారు. పాఠశాలల నిర్మాణం, ఆసుపత్రులకు సాయం, బాధిత కుటుంబాలకు తోడుగా నిలవడం వంటి ఎన్నో కార్యక్రమాల్లో ఈనాడు ముందంజలో ఉందని ప్రశంసించారు. ఇది కేవలం సేవ మాత్రమే కాదని, సమాజం పట్ల ఉన్న నిజమైన కట్టుబాటు అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )