దూరదృష్టితో వాతావరణ పరిరక్షణ.. 11 ఏళ్ల భారత్ ప్రస్థానం

దూరదృష్టితో వాతావరణ పరిరక్షణ.. 11 ఏళ్ల భారత్ ప్రస్థానం

దూరదృష్టితో వాతావరణ పరిరక్షణ.. 11 ఏళ్ల భారత్ ప్రస్థానం
-భూపేందర్ యాదవ్
హైదరాబాద్, జూన్ 27, (ప్రజా కలం):
మానవజనిత వాతావరణ మార్పుల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. పారిశ్రామిక విప్లవ పూర్వ (1850-1900) స్థాయిలతో పోలిస్తే 2011-20 దశాబ్దంలో భూమిపై ఉష్ణోగ్రత 1.1 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) ఆరో అంచనా నివేదిక స్పష్టం చేసింది. అదే సమయంలో, కర్బనోద్గారాల విడుదలలో ఎప్పటినుంచో అభివృద్ధి చెందిన దేశాల వాటాయే ఎక్కువగా ఉంటోంది. అయినప్పటికీ, వాతావరణ హిత చర్యలను వేగవంతం చేసేందుకు అవి సుముఖత వ్యక్తం చేయడం లేదు.
ఈ ఆందోళనలన్నింటినీ అధిగమించేలా, జీవులందరూ సంతోషంగా ఉండాలంటూ ‘సర్వేభవంతు సుఖినః’ అన్న ప్రాచీన వైదిక సూత్రం వేల ఏళ్లుగా మానవ నాగరికతకు మార్గనిర్దేశం చేసింది. వాతావరణ మార్పుల వంటి అస్తిత్వ సవాళ్లతో ప్రపంచం సతమతమవుతున్న వేళ.. వాతావరణ సంరక్షణలో భారత్ విధానాల్లో కాలాతీతమైన ఈ వైదిక జ్ఞానం ప్రతిధ్వనిస్తోంది.
ఓవైపు ఊష్ణోగ్రతల పెరుగుదల, అస్థిరమైన వాతావరణ ధోరణులు, విపత్తుల పెరుగుదల వంటి వాతావరణ మార్పుల ‘దుష్పరిణామాల’పైనే అంతర్జాతీయ సమాజం చాలావరకు ప్రధానంగా దృష్టిసారిస్తుండగా.. భారత్ మాత్రం ‘సానుకూల కార్యాచరణ’ను అనుసరిస్తోంది. మన నాగరికతలో వేళ్లూనుకున్న ఈ విధానమే గత 11 ఏళ్లుగా జాగరూకమైన, అంతర్జాతీయంగా వాతావరణ స్పృహ కలిగిన దేశంగా భారత్‌ను నిలిపింది.
‘‘భూమిని తవ్వి వెలికితీసినది అంతకంతా పెరగాలి – నీ జీవనాడిని తాకబోము, హృదయాన్ని చీల్చబోము’’ అంటూ సాగే అథర్వణ వేద శ్లోకం పునరుత్పాదక సహజ వనరుల నిర్వహణ సూత్రాలను ప్రతిబింబిస్తోంది. ఆధునిక వాతావరణ విజ్ఞాన శాస్త్రాల ఆవిర్భావానికి వేల ఏళ్ల ముందే ఇది మన తాత్వికతలో అంతర్భాగంగా ఉంది. ఈ ప్రాచీన వాతావరణ స్పృహను ప్రస్తుత విధానాలా రూపకల్పనలో పొందుపరుస్తూ వాతావరణ కార్యాచరణపై దృష్టి సారించడం జరిగింది. సాంప్రదాయక జ్ఞానమూ ఆధునిక కార్యాచరణల విశిష్ట సమ్మేళనమిది.
ఈ విధానానికి అనుగుణంగా, 2014లో పదవీ బాధ్యతలు స్వీకరించిన కొన్ని వారాల్లోనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వాతావరణ పరిరక్షణ పట్ల తన నిబద్ధతను, దూరదృష్టిని చాటారు. ‘వాతావరణ మార్పు’ అంశాన్ని పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలోకి తేవడం ద్వారా.. అంతర్జాతీయ అంశంగా ఉన్న పర్యావరణ హిత కార్యాచరణను పరిపాలన ప్రాధాన్యంగా మార్చారు. ఇదేమంత పెద్ద విషయంగా కనిపించకపోయినప్పటికీ, అమితంగా ప్రభావితం చేసిన అంశం. 2015లో వాతావరణ మార్పులపై జాతీయ అనుసరణ నిధి ఏర్పాటు ప్రభుత్వ అంకిత భావానికి నిదర్శనం. దీనిద్వారా వాతావరణ సంరక్షణ కోసం రాష్ట్రాలకు ప్రత్యేక వనరులను అందించింది. పలు రాష్ట్రాలు సొంతంగా ‘వాతావరణ మార్పు’ విభాగాలను ఏర్పాటు చేసుకోవడం వాతావరణ హిత చర్యల్లో సమాఖ్య స్ఫూర్తిని చాటింది.
2015లో ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో అంతర్జాతీయ వాతావరణ చర్చల్లో భారత్ ప్రముఖ పాత్ర పోషించింది. ప్రధానమంత్రి స్వయంగా పారిస్ వెళ్లి పారిస్ ఒప్పంద రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. నేలతల్లిని కాపాడుకోవడానికి అత్యున్నత స్థాయిలో భారత్ కట్టుబడి ఉన్నదనడానికి ఇది నిదర్శనం. వాతావరణ కట్టుబాట్లను భారంగా భావించిన దేశాల మాదిరి కాకుండా, నిశ్చయమైన కార్యాచరణకే భారత్ మొగ్గు చూపింది. ఆ దిశగా అదే ఏడాది పారిస్‌లో జరిగిన కాప్-21లో మొదటిసారిగా జాతీయ నిర్దేశక నియమాల (నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్)ను ప్రకటించింది. దేశీయ అవసరాలు, జాతీయ పరిస్థితుల నేపథ్యంలో మన అంతర్జాతీయ బాధ్యతను వాటి ద్వారా విధంగా వ్యక్తీకరించాం.
పారిస్ ఒప్పందంపై సంతకం చేసిన 2015లోనే మరో విశిష్టమైన కార్యక్రమానికి బీజం వేశాం. అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ)ని ఆ ఏడాదే ప్రారంభించాం. అది అంచెలంచెలుగా ఎదిగి, ఇప్పుడు 120 దేశాలకు పైగా అందులో సభ్యత్వాన్ని పొందాయి. సౌరశక్తి అధికంగా ఉన్న దేశాలు పర్యావరణ హిత ఇంధనం దిశగా సహకరించుకునేలా ఓ వేదికను ఈ కూటమి అందిస్తోంది. పునరుత్పాదక ఇంధన వనరులకు అది ఊతమిచ్చింది. 2014లో కేవలం 76 గిగావాట్లుగా ఉన్న పునరుత్పాదక ఇంధన వనరుల స్థాపిత సామర్థ్యం 2025 మార్చి నాటికి 220 గిగావాట్లకు పెరిగింది. 2030 నాటికి 500 గిగావాట్లకు పెరుగుతుందని భావిస్తున్నారు. పునరుత్పాదక ఇంధనంలో స్థాపిత సామర్థ్యం పరంగా భారత్ – పవన శక్తిలో నాలుగో స్థానంలో, సౌర శక్తిలో మూడో స్థానంలో నిలిచింది. ఈ దశాబ్దంలో సాధించిన అద్భుతమైన విజయమిది.
విప్లవాత్మకమైన వాతావరణ హిత కార్యాచరణలో భారత్ నిబద్ధతను ప్రతిష్ఠాత్మక పథకాలు మరింత దృఢతరం చేశాయి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన (2016) ద్వారా లక్షలాది మహిళలకు పర్యావరణ అనుకూల వంట ఇంధనం లభించింది. వాతావరణ అనుకూల చర్యలు సామాజిక న్యాయాన్నీ ఎలా అందించగలవో ఇది నిరూపించింది. ప్రధానమంత్రి – కుసమ్ పథకం (2019) సౌరశక్తి వినియోగాన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చింది. రూఫ్‌టాప్ సోలార్ ప్రోగ్రామ్ దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన పంపిణీని, వినియోగాన్ని వేగవంతం చేసింది.
2019 ఆగష్టు 28న విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని అధికారికంగా ప్రారంభించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. అదే ఏడాది సెప్టెంబర్ 23న న్యూయార్క్ నగరంలో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ కార్యాచరణ సదస్సులో ‘విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్ఐ)’ని ప్రకటించారు. స్వీడన్ భాగస్వామ్యంతో రూపొందించిన లీడ్ ఐటీ (లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్) వాతావరణ హిత లక్ష్యాల దిశగా పరిశ్రమల తీరుతెన్నుల్లో మార్పులకు భారత్ నిబద్ధతను చాటుతోంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకం (2020) దేశీయంగా సౌర పరికరాల తయారీ సామర్థ్యాన్ని బలోపేతం చేసింది. దీంతో దిగుమతులపై ఆధారపడడం తగ్గి, దేశీయంగా ఆ రంగం పటిష్టంగా మారింది.
2021 లో జరిగిన గ్లాస్గో కాప్-26 సమావేశంలో పాల్గొన్న భారత్.. వాతావరణ మార్పు అంశంలో తన వైఖరిని స్పష్టం చేసే చారిత్రాత్మక ప్రకటనలు చేసింది. మన జాతీయ దృక్కోణాన్ని తెలిపే అధికారిక ప్రకటన చేస్తూ మంత్రి పంచామృత్‌ను పరిచయం చేశారు. 2070 నాటికి నెట్-జీరో ఎమిషన్స్ (ఉద్గార రహిత) లక్ష్యాన్ని చేరకునేందుకు, పర్యావరణ అనుకూల విధానాల పట్ల గల నిబద్ధతకు సూచనగా, మంత్రి అయిదు అద్భుత అంశాల కలబోత అయిన పంచామృతాన్ని ప్రస్తావించారు. ఇదే అంశంపై ప్రసంగించిన ప్రధానమంత్రి ‘మిషన్ లైఫ్’ అనే పథకాన్ని గురించి వివరించారు. ‘పర్యావరణ అనుకూల జీవనం’ అనే ఈ విధానం విపరీత వాతావరణ మార్పులను నిలువరించే ప్రయత్నంలో ప్రపంచ ప్రజలు ఒక్క తాటిపై నిలిచి కృషి చేయాలని ఆశిస్తుంది. ఈ గట్టి సంకల్పం భారత్ ను అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య నాయక పాత్రలో నిలబెట్టింది.
వాతావరణ మార్పుల వల్ల ప్రభావితమయ్యే దేశాలకు మద్దతు ప్రకటిస్తూ, నవంబర్ 2న గ్లాస్గో కాప్-26 సమావేశాల్లో ప్రధానమంత్రి ‘ఐరిస్’ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెజిలియెంట్ ఐలాండ్ స్టేట్స్) ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా, ఫిజీ, జమైకా, మారిషస్, బ్రిటన్ దేశాల ప్రధానమంత్రులు పాల్గొన్నారు.
2022లో భారత్ ఎన్డీసీ (జాతీయ పర్యావరణ కార్యాచరణ ప్రణాళిక)ని నవీకరించింది. ఆరోగ్యవంతమైన, పర్యావరణ అనుకూల జీవన లక్ష్యాన్ని చేరుకునేందుకు సాంప్రదాయకంగా పాటించే పరిమితి, నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ వంటి విలువలు సహా మిషన్ లైఫ్ ను జాబితాలో చేర్చింది. పర్యావరణం పట్ల నిబద్ధతను వెల్లడిస్తూ, 2022 నవంబర్ లో ‘దీర్ఘకాలిక తక్కువ ఉద్గారాల విడుదల వ్యూహం’ (ఎల్టీ–లెడ్స్)ను ప్రకటించింది. ఇందులో 2070 నాటికి జీరో-ఎమిషన్స్ లక్ష్యాన్ని చేరుకునేందుకు అనుసరించబోయే వ్యూహాన్ని సమర్పించింది. అదే సంవత్సరం దేశంలో జాతీయ హరిత ఇంధన పథకం – గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రారంభమైంది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, ఎగుమతుల్లో దేశాన్ని ప్రపంచ అగ్రశ్రేణి ఎగుమతిదారుగా నిలిపే ఈ చర్య, ఇంధన రంగంలో స్వయం సమృద్ధి, పరిశుభ్రమైన ఇంధనం అనే రెండు లక్ష్యాలకు అనుకూలంగా ఉంది.
“పర్యావరణం-ఆర్థిక వ్యవస్థ”,”ప్రకృతి-ప్రగతి” అనే అంశాల మధ్య సున్నితమైన సమతౌల్యతను పాటించడం ద్వారా 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే భారతదేశం లక్ష్యాన్ని, 2023 ‘వికసిత్ భారత్’ ప్రకటన తెలియజేసింది. ‘వికసిత్ భారత్@2047’ దార్శనికతకు భారతదేశ వాతావరణ విధానం ఎంతో అనుకూలమైనది. విపరీత వాతావరణ మార్పులను తగ్గించేందుకు తీసుకున్న చర్యలు సహా, ఇతర సకారాత్మక చర్యల వివరాలతో కూడిన సమగ్రమైన ‘అడాప్టేషన్ కమ్యూనికేషన్ విత్ ది బైయెనియల్ అప్‌డేట్’ నివేదికను కూడా భారత్ సమర్పించింది.
ప్రభుత్వం 2024లో రెండు పరివర్తనాత్మక పౌర-కేంద్రీకృత కార్యక్రమాలను ప్రారంభించింది. ‘ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ సౌరశక్తిని అందరికీ అందుబాటులోకి తేగా, “ఏక్ పేడ్ మా కే నామ్” (తల్లి పేరు మీద ఒక చెట్టు) కార్యక్రమం ఒక సామూహిక ఉద్యమంగా మారి ప్రతి పౌరుడు సానుకూల పర్యావరణ హిత కార్యక్రమాల్లో భాగమయ్యే వీలు కల్పించింది.
ఇంధన భద్రత, సుస్థిరత్వాన్ని సాధించడంలో అణుశక్తి కీలకమైన అంశమని గుర్తించడంతో, 2025లో వికసిత్ భారత్ లో భాగంగా జాతీయ ఇంధన మిషన్, జాతీయ ఉత్పత్తి మిషన్ లు ప్రారంభమయ్యాయి. 2025-26 కేంద్ర బడ్జెట్ నుంచి రూ. 20,000 కోట్ల కేటాయింపులు పొందిన అణు శక్తి మిషన్, చిన్న మాడ్యులర్ రియాక్టర్ల (ఎస్ఎంఆర్ లు) పరిశోధన, అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తుంది. 2033 నాటికి కనీసం ఐదు స్వదేశీ ఎస్ఎంఆర్ లను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్న ఈ మిషన్, భారతదేశాన్ని అత్యాధునిక అణు సాంకేతికతలో అగ్రగామిగా నిలబెట్టాలని ఆశిస్తోంది.
2030 నాటికి మెరుగైన ఎన్డీసీ ని సాధించే దిశగా అడుగులు వేస్తోన్న భారత్, 2030-35 నాటికి ఎన్డీసీ సవరణకు సంసిద్ధమవుతోంది. వాతావరణ అనుకూల విధానాల్లో నిరంతర మెరుగుదలను ప్రదర్శిస్తూ, మొదటి జాతీయ అనుసరణ ప్రణాళికను కూడా సమర్పించే అవకాశం ఉంది.
సప్లై రంగంలో కట్టడి చర్యలు, డిమాండ్ వైపు వ్యక్తిగత స్థాయిలో పర్యావరణ అనుకూల జీవనశైలిని ప్రోత్సహించడం ద్వారా భారత్ కీలక పర్యావరణ అనుకూల చర్యలను చేపడుతోంది.
ముఖ్యంగా ‘జన్ భాగీదారి’ పిలుపుతో భారతదేశం వాతావరణ అనుకూల చర్యలను ప్రభుత్వ బాధ్యత అనే చట్రం నుంచి విడుదల చేసి సామూహిక ఉద్యమంగా మార్చివేసింది.
“వసుధైవ కుటుంబకం”- ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే పురాతన భారతీయ సూత్రాన్ని మన అంతర్జాతీయ వాతావరణ కార్యక్రమాలు ప్రతిబింబిస్తాయి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ఐఎస్ఏ), కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సీడీఆర్ఐ), గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, లీడ్‌ఐటి, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ (ఐబీసీఏ) వంటి కార్యక్రమాలు, సమస్యల పట్ల భారత దేశ దృక్పథాన్ని తేటతెల్లం చేస్తాయి – సవాళ్ళ గురించి మాటలకే పరిమితమవక, క్రియాశీల చర్యల ద్వారా పరిష్కారాల కోసం ప్రయత్నించే నిబద్ధతను నిరూపిస్తాయి.
భారతదేశం జీ-20 కి అధ్యక్షత వహించిన సమయంలో వాతావరణ అంశాలను పర్యావరణం, వాతావరణ వర్కింగ్ గ్రూపులకు మాత్రమే పరిమితం చేయక, అనేక క్రియాశీల బృందాలకు అవగాహన కల్పించి ఆ అంశాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకువెళ్ళింది. డెవలప్‌మెంట్ వర్కింగ్ గ్రూప్ సుస్థిరమైన అభివృద్ధి కోసం జీవనశైలిపై దృష్టి సారించగా, ఎనర్జీ వర్కింగ్ గ్రూప్ న్యాయబద్ధమైన, సమ్మిళిత ఇంధన పరివర్తనపై దృష్టి సారించింది. వాతావరణ సవాళ్ళు ఏ ఒక్క రంగానికో పరిమితం కాక, సరిహద్దులను ఎలా అధిగమిస్తాయో ఈ అంశం ప్రదర్శిస్తుంది. స్థిరమైన జీవ ఇంధనాల కోసం అంతర్జాతీయ వేదిక ఏర్పాటుకు వీలు కల్పిస్తూ భారతదేశం గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్‌ ను కూడా ప్రారంభించింది.
“ఇబ్బంది పెట్టే వాస్తవాలను”, “అనుకూల చర్యలుగా” మలచడంలో పర్యావరణ నాయకత్వానికి శాస్త్రీయ అవగాహనతో పాటు నైసర్గిక సమతౌల్యత కోసం మానవుడు క్రియాశీలకంగా వ్యవహరించవలసిన తీరు గురించిన అవగాహన కూడా ఉండాలని మన ప్రధానమంత్రి నిరూపించారు.
(భూపేందర్ యాదవ్ కేంద్ర పర్యావరణ, అటవి, వాతావరణ మార్పుల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు)

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )