
ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్యం
*క్లిష్టమైన సర్జరీలు విజయవంతం చేసిన వైద్య బృందం
-వైద్య బృందానికి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అభినందనలు
పెద్దపల్లి,జూలై 03: పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల నిర్వహించిన రెండు క్లిష్టమైన శస్త్రచికిత్సలు విజయవంతం కావడంతో,జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష వైద్య బృందాన్ని అభినందిస్తూ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
లాప్రోస్కోపిక్ ద్వారా పిత్తాశయ శస్త్రచికిత్స
31 సంవత్సరాల పోతుల స్రవంతి అనే మహిళ చాలా కాలంగా పిత్తాశయంలో రాళ్లతో బాధపడుతూ కడుపు నొప్పి, వాంతులు వంటి సమస్యలతో సతమతమవుతోంది.పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో లాప్రోస్కోపిక్ సర్జరీలు చేస్తున్నారని తెలుసుకుని,మూడు రోజుల క్రితం జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.కె.శ్రీధర్‌ను సంప్రదించారు.డా.శ్రీధర్ వెంటనే స్పందించి,అవసరమైన రక్త పరీక్షలు, స్కానింగ్,2డి ఎకో వంటి పరీక్షలు నిర్వహించి పేషెంట్‌ను అడ్మిట్ చేసుకున్నారు.గురువారం డా.శ్రీధర్ నేతృత్వంలోని వైద్య బృందం విజయవంతంగా లాప్రోస్కోపిక్ పద్ధతిలో పిత్తాశయ శస్త్రచికిత్సను పూర్తి చేసింది.పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి కార్పొరేట్ స్థాయి సర్జరీలు నిర్వహించడం వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని రోగి బంధువులు సంతృప్తి వ్యక్తం చేశారు.
సంక్లిష్టమైన గర్భసంచి తొలగింపు శస్త్రచికిత్స విజయవంతం
పెద్దపల్లికి చెందిన 36 సంవత్సరాల గడ్డం కవిత గర్భసంచిలో గడ్డలతో తీవ్ర రక్తస్రావంతో కొంతకాలంగా బాధపడుతోంది. ఈమె డా.అనసూయ,డా.శ్రీధర్‌లను సంప్రదించగా,వారు తక్షణమే స్పందించి పేషెంట్‌ను అడ్మిట్ చేసుకుని స్కానింగ్, 2డి ఎకో,రక్త పరీక్షలు నిర్వహించారు.కవితకు గతంలో మూడు పెద్ద ఆపరేషన్లు జరిగాయి.ఈ నాలుగో ఆపరేషన్ అత్యంత సంక్లిష్టమైనదిగా మారింది,ఎందుకంటే ఆమె పేగులు, మూత్రాశయం గర్భసంచికి అతుక్కుని ఉన్నాయి. అయినప్పటికీ,డా.అనసూయ,డా.స్వాతి,డా.శ్రీధర్‌ల వైద్య బృందం ఈ సంక్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో గురువారం పది మంది నవజాత శిశువులు చికిత్స పొందుతున్నారు.వీరిలో ఒక శిశువుకు సి-పాప్ ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తున్నారు.జిల్లా ప్రజలు ఇలాంటి అన్ని రకాల వైద్య సేవలను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వినియోగించుకోవాలని కలెక్టర్ తన ప్రకటనలో కోరారు.

