
ఉత్సాహంగా సాగిన పోలీస్, ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్
క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల ప్రతినిధి అక్టోబర్ 26(ప్రజా కలం):
జిల్లా పోలీస్ టీం వర్సెస్ ప్రెస్ టీం ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ ఉత్సాహంగా సాగింది. ఆదివారం జిల్లా కేంద్రం లోని పోలీస్ పరేడ్ మైదానంలో పోలీస్ వర్సెస్ ప్రెస్ మధ్య నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రారంభించారు. టాస్ గెలిచిన జిల్లా ప్రెస్ జట్టు మొదటగా బ్యాటింగ్ చేపట్టి నిర్ణీత 12 ఓవర్లకు 90 పరుగులు చేసింది.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన పోలీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో 91 పరుగులు చేసి విజయం సాధించింది. అనంతరం విజేత,రన్నర్ జట్టులకు ట్రోఫీ లను,జట్టు సబ్యులకు మెమెంటోలు, “బెస్ట్ బ్యాట్స్‌మన్”, “బెస్ట్ బౌలర్”, “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డులు ఎస్పీ అశోక్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ “పోలీసులు, మీడియా సమాజానికి రెండు ముఖ్యమైన వర్గాలు అని,మీడియా, పోలీసులు సమాజంలో ఒకే లక్ష్యంతో పనిచేస్తారన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందని, నిత్యం బిజీగా ఉండే పోలీసులు, జర్నలిస్టులు కొంత సేపు ఆహ్లాదకరంగా గడిపారన్నారు. ప్రెస్, పోలీసుల మధ్య మంచి కోఆర్డినేషన్ ఉండడానికి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం ఒక సారి ఈ విధంగా క్రికెట్ మ్యాచ్ కండెక్ట్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికీ ఆటవిడుపు తో పాటు మంచి టీమ్ స్పిరిట్ వస్తుందని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీలు వెంకటరమణ, రఘు చందర్, రాములు , తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ ( ఐజేయు) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చీటి శ్రీనివాస్ రావు, సంపూర్ణాచారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగుల గోపాల చారి, మెట్ పల్లి ప్రెస్ క్లబ్ కార్యదర్శి అజీమ్, మల్లారెడ్డి, ఎస్ బి ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్ సి.ఐ లు అనిల్ కుమార్ ,రామ్ నరసింహ రెడ్డి,సురేష్,రవి,కరుణాకర్, ఆర్ ఐ లు సైదులు, వేణు, ఎస్.ఐ లు, పాత్రికేయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

