
కుక్కల బెడద… జంకుతున్న ప్రజలు
– మెట్ పల్లిలో పెరుగుతున్న కుక్క కాటు కేసులు
హా ఇంటి బయటకు రావాలంటేనే భయపడుతున్న చిన్న పిల్లలు, మహిళలు
– రోజు రోజుకు కుక్క కాటు కేసులు పెరుగుతున్నా పట్టించుకోని మున్సిపల్ అధికారులు
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి, జూలై 11 (ప్రజాకలం) : కుక్కల బెడదతో పట్టణంలో జనం జంకుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా కాలనీ, వార్డుల్లో, మెయిన్ రోడ్లలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కల దాడితో పిల్లలు, పెద్దలు బెదిరిపోతున్నారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు గత 10 రోజుల రోజుల వ్యవధిలో మెట్ పల్లి పట్టణంలో ఎంతో మందిని కుక్క కాటు వేసిన కేసులు నమోదు అయ్యాయంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది. ప్రధానంగా మెట్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని వెల్లుల్ల రోడ్డు, దుబ్బవాడ, కళానగర్, సుల్తాన్ పుర, ముస్లింపుర, బర్కత్ పుర, చైతన్య నగర్, టీచర్స్ కాలనీ, ఇందిర ప్రియదర్షిని కాలనీ, ఆరపేట, గాజులపేట ఏరియాల్లో పగలు, రాత్రి అనే తేడా లేకుండా పదుల సంఖ్యలో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. ఏ వీధిలో చూసిన కుక్కల గుంపులే కనిపిస్తున్నాయి. మెట్ పల్లి బల్దియా పరిధిలో 26 వార్డుల పరిధిలో పదుల సంఖ్యకు పైగా చిన్నారులు, మహిళలు, వృద్దులకు కుక్కలు కాటు వేయడంతో మెట్ పల్లి సర్కారీ హాస్పిటల్, ప్రైవేటు హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ పొందారు. ఉదయం వాకింగ్ వెళ్ళేవారు, స్కూల్ కు వెళ్ళే చిన్నారులపై, బైకులపై వెళ్లే వారి వెంట పడి తరుముతున్నాయి. దీంతో ప్రజల ప్రాణాల మీదకు వస్తోందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాత్రి వేళల్లో ఇంటికి వెళ్ళాలంటే భయమే…
ఉదయం పూట కంటే నైట్ టైంలో కుక్కలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ జనాన్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. రాళ్లు తీసుకొని కొట్టినా వెంటపడి తరుముతున్నాయి. దీంతో రాత్రి ఇంటికి వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. అతి కష్టం మీద వాటి బారి నుంచి తప్పించుకుని ఇళ్లకు చేరుకునే సరికి చుక్కలు కనిపిస్తున్నాయని కాలనీ వాసులు వాపోతున్నారు. ఇటీవల సుల్తాన్ పుర, దుబ్బవాడకు చెందిన పలువురు కుక్కల దాడిలో ప్రజలు గాయపడ్డారని చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కలను పట్టుకొని తీసుకెళ్లాలని కోరుతున్నారు.
కుక్కల బెడదను నివారించాలి
– రమేష్ యాదవ్, దుబ్బవాడ, మెట్ పల్లి
మెట్ పల్లిలో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. రాళ్లతో కొట్టినా పారి పోకుండా కొడుతున్న వారిపై దాడికి దిగుతున్నాయి. కేవలం నాలుగు రోజుల్లో పదుల సంఖ్యలో కుక్కకాటు కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది. కుక్కలను పట్టుకెళ్లి వాటి దాడి నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలి. బల్దియా అధికారులకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశాము. ఇంత వరకు అధికారులు స్పందించలేదు. అధికారులు స్పందించి కుక్కల బారి నుంచి కాపాడాలి
ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు
– సమీర్, దుబ్బవాడ, మెట్ పల్లి.
గత కొన్ని రోజులుగా మెట్ పల్లి పట్టణంలో కుక్కల బెడద ఎక్కువైంది. రోడ్డుపై వెళ్తున్న చిన్నారులు, పెద్దలపై దాడి చేస్తున్నాయి. రాత్రి వేళల్లో పనులు పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు, ఉదయం ఇంటి నుంచి దుకాణాలకు వెళ్లేటప్పుడు కాటేస్తున్నాయి. కుక్కల దాడిలో వందల సంఖ్యలో పిల్లలు, పెద్దలకు గాయాలై దవాఖానలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. పట్టణంలో పలు ప్రాంతాల్లో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నా బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు. జిల్లా అధికారులు స్పందించి పట్టణంలో కుక్కల బెడద తీర్చేలా చర్యలు తీసుకోవాలి.


