
ఎన్నికల నేపథ్యంలో విస్తృత తనిఖీలు
గండి హనుమాన్ చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి డిసెంబర్ 09 (ప్రజా కలం) సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి తెలిపారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా బార్డర్ వద్ద ఏర్పాటు చేసిన గండి హనుమాన్ చెక్‌పోస్ట్ ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు.ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేస్తునామని, నగదు, మద్యం, ఉచిత పంపిణీలు, ఇతర ప్రలోభాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతున్నదని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున పోలీసులు అన్ని శాఖల సమన్వయంతో ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్‌ను కఠినంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఓటర్లను ప్రలోభ పెట్టే ఏ చర్యలకు కూడా ఎవరూ పాల్పడవద్దు అని ఎన్నికలకు సంబంధించి అక్రమంగా నగదు, మద్యం లేదా వస్తువులు తరలిస్తే, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు.చెక్‌పోస్ట్ వద్ద సిబ్బంది ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా, పకడ్బందీగా తనిఖీ చేయాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.అనంతరం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఎస్పీ వెంట డీఎస్పీ రాములు, మెట్ పల్లి సీ.ఐ అనిల్ కుమార్, ఇబ్రహీంపట్నం ఎస్.ఐ అనిల్ చెక్ పోస్ట్ సిబ్బంది ఉన్నారు.


