
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు
మెట్ పల్లి డిఎస్పి రాములు
మెట్ పల్లి:(కోరుట్ల)ప్రతినిధి ఫిబ్రవరి 9 (ప్రజాకలం) :కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాలలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని పార్టీలు సహకరించాలని మెట్ పల్లి డిఎస్పి రాములు అన్నారు. సోమవారం నాడు డిఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచార గడువు ముగియడంతో పాటు ఈ నెల 11 న జరిగే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించాలని తెలిపారు. అభ్యర్థులు, పార్టీల నాయకులు ఎన్నికల నిబంధనలను విధిగా పాటించాలన్నారు. పోలింగ్ కేంద్రానికి సమీపంలో ఓట్లు అభ్యర్థించే క్రమంలో గొడవలకు ఆస్కారం ఇవ్వకుండా సహకరించాలని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువైందని ప్రలోభాలకు లొంగకుండా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా గొడవలకు దారి తీసేలా పరిస్థితులను తీసుకువస్తే వారి పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు. పాత నేరస్తులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని వారిపై నిఘా ఏర్పాటు చేసి పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన నాన్ లోకల్ నాయకులు ఎవరైనా ఉంటే పట్టణాలను విడిచి వెళ్లాలని సూచించారు. ఇందుకోసం అర్ధరాత్రి వరకు ఆయా పట్టణాల్లో ఉన్న లాడ్జిల్లో తనిఖీలు నిర్వహిస్తామని అన్నారు. ఎన్నికలు జరిగే కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నాయని పోలింగ్ కేంద్రాలలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రతి మూమెంట్ పరిశీలిస్తామని తెలిపారు.డీఎస్పీ వెంట సిఐ అనిల్ కుమార్, మెట్ పల్లి ఎస్సై కిరణ్, కోరుట్ల ఎస్ఐ చిరంజీవి తదితరులు ఉన్నారు.

