మెట్‌పల్లిలో బయటపడ్డ భారీ ‘హనీ ట్రాప్’ ముఠా..

మెట్‌పల్లిలో బయటపడ్డ భారీ ‘హనీ ట్రాప్’ ముఠా..

రౌడీ షీటర్ నేతృత్వంలో విచ్చలవిడి దందా !
ఉచ్చులో పడితే నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్
– ముగ్గురు నిందితుల అరెస్ట్, ముగ్గురు పరారీ
వ్యాపారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు
– రౌడీ షీటర్ సహా ముగ్గురు కటకటాల్లోకి
మెట్ పల్లిలో సంచలనం
మెట్‌పల్లి:(కోరుట్ల) ప్రతినిధి డిసెంబర్ 31 (ప్రజా కలం) అమాయక వ్యక్తులను, ముఖ్యంగా ధనవంతులను టార్గెట్ చేస్తూ మహిళలతో వల వేసి, ఏకాంతంగా ఉన్న సమయంలో నగ్న వీడియోలు తీసి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న ఒక ప్రమాదకరమైన హనీ ట్రాప్ ముఠాను మెట్‌పల్లి పోలీసులు ఛేదించారు. ఈ ముఠాకు నాయకత్వం వహిస్తున్న రౌడీ షీటర్ కోరుట్ల రాజుతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెట్‌పల్లి సిఐ అనిల్ కుమార్ మాట్లాడుతూ దుబ్బవాడకు చెందిన కోరుట్ల రాజ్‌కుమార్ అలియాస్ రాజుపై గతంలోనే పలు కేసులు ఉండటంతో పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారన్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో రాజు, భర్తకు దూరంగా ఉంటున్న బలుమూరి స్వప్న అనే మహిళతో చేతులు కలిపాడన్నారు. వీరిద్దరితో పాటు బట్టు రాజశేఖర్, సుంకిటి వినోద్, పులి అరుణ్, మాగని దేవా నర్సయ్యలు ఒక ముఠాగా ఏర్పడ్డారన్నారు. ఈ క్రమంలో మెట్‌పల్లి హనుమాన్ నగర్‌లోని బచ్‌పన్ స్కూల్ సమీపంలో ఒక గదిని అద్దెకు తీసుకున్న ఈ ముఠా, మహిళల పట్ల బలహీనత ఉన్న ధనవంతుల ఫోన్ నంబర్లు సేకరించేవారన్నారు. స్వప్న వారితో ఫోన్లో కవ్వించి మాట్లాడుతూ తన గదికి రప్పించేదన్నారు. బాధితులు లోపలికి వెళ్లి నగ్నంగా ఉన్న సమయంలో నిందితులు ఒక్కసారిగా గదిలోకి ప్రవేశించి సెల్ ఫోన్లలో వీడియోలు తీసేవారన్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి లక్షలాది రూపాయలు వసూలు చేసేవారన్నారు. ఇప్పటికే ఈ ముఠా పలువురిని బ్లాక్ మెయిల్ చేసినట్లు విచారణలో తేలిందన్నారు.ఈ నేపథ్యంలో మూడు నెలల క్రితం మెట్‌పల్లికి చెందిన ఒక వ్యాపారిని టార్గెట్ చేసిన ఈ ముఠా ఈ నెల 28న ప్లాన్ ప్రకారం గదికి పిలిపించి నగ్న వీడియోలు తీసిందని సిఐ తెలిపారు. విషయం బయటకు రాకుండా ఉండాలంటే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని బెదిరించారని బెదిరింపు లకు పాల్పడ్డారని వెల్లడించారు. బాధితుడు ధైర్యంతో పోలీసులను ఆశ్రయించడంతో ఈ ముఠా గుట్టు రట్టయిందన్నారు. కోరుట్ల రాజ్‌కుమార్ (రౌడీ షీటర్),మాగని దేవా నర్సయ్య, బలుమూరి స్వప్న లను అరెస్ట్ చేశామని, ఎర్దండి కి చెందిన బట్టు రాజశేఖర్, మూల రాంపూర్ కు చెందిన సుంకిటి వినోద్, మెట్పల్లి కి చెందిన పులి అరుణ్ అనే రౌడీ షీటర్ లు పరార్ ఉన్నట్లు తెలిపారు. వారి నుండి 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ వెల్లడించారు.అందులో గతంలో వారు చేసిన బ్లాక్ మెయిల్ వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, ఇటువంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెట్‌పల్లి సి ఐ అనిల్ హెచ్చరించారు. సి.ఐ. అనిల్ కుమార్ ఎస్ ఐ పబ్బా కిరణ్ తో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఈ నేరానికి సంబంధించిన వివరాలు తెలిపారు. సోషల్ మీడియా లేదా అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్ నమ్మి మోసపోవద్దని ప్రజలకు ఆయన సూచించారు. ఎవరైనా ఇటువంటి వేధింపులకు గురైతే భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలన్నారు. ఈ ముఠా గుట్టు రట్టు చేసిన సి.ఐ,వారి బృందాన్ని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )