మాదిగ జాతికి రేవంత్ పాలనలో అన్యాయం: మందకృష్ణ మాదిగ

మాదిగ జాతికి రేవంత్ పాలనలో అన్యాయం: మందకృష్ణ మాదిగ

మాదిగ జాతికి రేవంత్ పాలనలో అన్యాయం: మందకృష్ణ మాదిగ
దొమ్మటి సాంబయ్యకు ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవి ఇవ్వాలి – డిమాండ్

హైదరాబాద్ మార్చి06 (ప్రజా కలం)  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞత మరిచి మాదిగ జాతికి నమ్మకద్రోహం చేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ తీవ్రంగా విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పాలనలో మాదిగ జాతికి గతంలో ఎప్పుడూ జరగని అన్యాయం జరిగిందన్నారు.

చట్టసభల్లో మాదిగలకు అవకాశం లేకుండా చేశారని విమర్శ

తన రాజకీయ ఎదుగుదలకు మాదిగ జాతి మద్దతు ఉందని అనేక వేదికలపై చెప్పిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం లోక్‌సభ, రాజ్యసభ, శాసనమండలిలో ఒక్క మాదిగకు కూడా అవకాశం ఇవ్వలేదని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. నాలుగు రకాల చట్టసభలలో మూడు చోట్ల మాదిగల ప్రాతినిధ్యం లేకుండా పోవడానికి రేవంత్ రెడ్డి కారణమయ్యారని అన్నారు.

రాజ్యసభ సీటు విషయంలో అన్యాయం

రాజ్యసభ సీటు విషయంలో మాదిగ జాతికి చెందిన దొమ్మటి సాంబయ్యను పక్కనపెట్టి తన కులానికి చెందిన వేం నరేందర్ రెడ్డికి టికెట్ ఇప్పించారని మండిపడ్డారు. సీఐ ఉద్యోగాన్ని వదిలి రేవంత్ రెడ్డిని నమ్ముకుని ఉన్న సాంబయ్యకు న్యాయం చేయకుండా అన్యాయం చేశారని అన్నారు.

ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు నష్టం

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో మాదిగలకు జనాభా ప్రాతిపదికన రావలసిన 11 శాతం వాటా ఇవ్వకుండా కేవలం 9 శాతం మాత్రమే ఇచ్చి అన్యాయం చేశారని పేర్కొన్నారు. ఒక శాతం తగ్గినా వేలాది విద్యా, ఉద్యోగ అవకాశాలు కోల్పోవాల్సి వస్తుందని చెప్పారు.

ఉద్యోగ నియామకాలలోనూ అన్యాయం

రేవంత్ రెడ్డి ప్రభుత్వం 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెబుతున్నప్పటికీ వాటిలో వర్గీకరణ అమలు చేయకపోవడం వల్ల వేలాది మాదిగ నిరుద్యోగ యువత నష్టపోయిందన్నారు. గత నోటిఫికేషన్లకు కూడా వర్గీకరణ అమలు చేస్తామని అసెంబ్లీలో చెప్పి, తరువాత ఒత్తిడులకు తలొగ్గి అమలు చేయలేదని విమర్శించారు.

సాంబయ్యకు ప్రధాన సలహాదారు పదవి ఇవ్వాలి

రాజ్యసభకు వేం నరేందర్ రెడ్డి వెళ్లడంతో ఖాళీ అయిన క్యాబినెట్ హోదా కలిగిన ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవిని మాదిగ జాతికి చెందిన దొమ్మటి సాంబయ్యకు ఇవ్వాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోవిందు నరేష్ మాదిగ, ఎమ్మెస్‌ఎఫ్ జాతి అధ్యక్షుడు డాక్టర్ చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ, ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇంజం వెంకటస్వామి మాదిగ, మాదిగ మహిళా సమైక్య నాయకురాలు జేపీ లత మాదిగ, టీవీ నరసింహా మాదిగ, డా.కొమ్ము శేఖర్ మాదిగ, డప్పు మల్లికార్జున్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )