
బతుకమ్మ పండుగలో డాన్సులా ?
-పండుగకు సంబంధం లేని డీజే పాటలతో ఇష్టారాజ్యంగా ఆడి పాడుతున్న మహిళలు, యువతులు
– చప్పట్లు కొడుతూ ఆడాల్సిన బతుకమ్మను డాన్స్లు చేస్తూ జరుపుకుంటున్న వైనం
– పండుగ ప్రాశస్యాన్ని, ప్రాముఖ్యతను కించ పరుస్తున్న యువతులు
– భవిష్యత్తులో బతుకమ్మ పండుగ అంటే డాన్స్ పండగ అని అనాల్సి వస్తుందేమో
– ప్రవచనకారులు ఆధ్యాత్మికవేత్తలు ఎంత చెప్పినా మారని యువతుల తీరు
– వింత పోకడలతో కనుమరుగవుతున్న సాంప్రదాయ పండుగ విశిష్టత

ప్రస్తుత ఆధునిక కాలంలో ఎంతో ప్రాముఖ్యత గల బతుకమ్మ పండుగను అర్థం పర్థం లేని డీజే పాటలతో డాన్సులు చేస్తూ పండుగను కించపరుస్తున్న వైనంపై ప్రజాకలం దినపత్రిక ప్రత్యేక కథనం
ఎల్లారెడ్డి సెప్టెంబర్ 26 ప్రజా కలం ప్రతినిధి : యావత్ ప్రపంచ వ్యాప్తంగానే తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరుపుకునే బతుకమ్మ పండుగ విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. కేవలం ప్రకృతిలో పూసే పువ్వులనే దేవతగా భావించి జరుపుకునే పండుగే బతుకమ్మ. ఈ పండుగలో మహిళలు రంగురంగుల పూలను అందంగా పేర్చి బతుకమ్మ గా తయారు చేసే వాటి చుట్టూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలను పాడుతారు. మహాలయ అమావాస్య రోజున బొడ్డెమ్మతో మొదలయ్యే బతుకమ్మ పండుగ వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. తొమ్మిది రోజులపాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో లేదా చెరువులు, కుంటలలో నిమజ్జనం చేస్తారు.
బతుకమ్మ పండుగలోని తొమ్మిది రోజుల పేర్లు…
1. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ.
2. రెండో రోజు అటుకుల బతుకమ్మ.
3. మూడవరోజు ముద్దపప్పు బతుకమ్మ
4. నాలుగవ రోజు నాన బియ్యం బతుకమ్మ
5. అయిదవ రోజు అట్ల బతుకమ్మ
6. ఆరవ రోజు అలుక బతుకమ్మ
7. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ
8. ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ
9. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ
బతుకమ్మ అస్తిత్వం తెలుసుకుందాం….
తెలంగాణ ప్రాంతంలో గత వెయ్యి ఏళ్లుగా బతుకమ్మ పండుగను ప్రజలు ఇంటి దేవతగా పూజిస్తూ ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ పండుగలో ఎన్నో చరిత్రలు, పురాణాలు ఉన్నాయి. ఇందులో మహిళలు ఎన్నో చారిత్రక పాటలు పాడుతారు. ఈ పాటలు చాలా వినుసోంపుగా ఉంటాయి. తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకయే బతుకమ్మ పండుగ. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. గతంలో నవాబులు, భూస్వాముల పెత్తందారితనం లో నలిగిపోతున్న తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి ఆకృత్యాలకు నలిగిపోయి వాటిని తట్టుకోలేక ఎందరో ఆత్మహత్యలు చేసుకునే వారు. వారిని తలుచుకొని తోటి మహిళలు, కుటుంబ సభ్యులు బాధపడేవారు. వారికి ప్రతీకగా పూలను బతుకమ్మలాగా పేర్చి బతుకవమ్మ.. బతుకమ్మ… అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… అంటూ పాడే పాటలు వెనుక ఉండే మర్మం ఇదే.
బతుకమ్మ పండుగ వెనుక ఆచార సంప్రదాయాలు:
ప్రకృతి ఆరాధన:
బతుకమ్మ అనేది ప్రకృతిని ఆరాధించే పండుగ. ఈ పండుగలో వాడే తంగేడు, గునుగు, తామర వంటి పూలకు కొన్ని శాస్త్రీయ, పర్యావరణ కారణాలు ఉన్నాయి.
గౌరీదేవి పూజ
ఈ పండుగ గౌరీదేవిని, అంటే పార్వతీదేవిని పూజిస్తూ జరుపుకుంటారు. బతుకమ్మ అంటే “మాతృదేవత సజీవంగా ఉంటుంది” అని అర్థం.
పువ్వుల కూర్పు:
ప్రతిరోజూ మహిళలు, పిల్లలు పొలాల నుండి, చెట్ల నుండి రకరకాల పువ్వులు సేకరించి, వాటిని ‘బతుకమ్మ’ అనే ఒక గుట్టగా పేర్చుతారు. ఎరుపు, పసుపు రంగుల తంగేడు పువ్వులు, గునుగు, చామంతి, బంతి, తామర పూలు, సీత జడలు ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఆటపాటలు:
తొమ్మిది రోజుల పాటు మహిళలు బతుకమ్మ చుట్టూ, రకరకాల పాటలు పాడుతూ, ఆటలాడుతూ ఉంటారు.
నిమజ్జనం:
చివరి రోజున, అనగా ‘సద్దుల బతుకమ్మ’ రోజున, ఈ బతుకమ్మను చెరువులు లేదా నీటిలో వదులుతారు.
పండుగ ప్రాముఖ్యత :
ఈ పండుగ ప్రకృతిని, స్త్రీత్వాన్ని గౌరవిస్తుంది. ఇది పంటలు బాగా పండటానికి, అలాగే రాబోయే సంవత్సరానికి కూడా మంచి పంట పండాలని ఆకాంక్షిస్తూ జరుపుకునే పండుగ.
సాంస్కృతిక గుర్తింపు:
బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక గుర్తింపునకు ప్రతీకగా నిలుస్తుంది.
సంబంధం లేని డీజే పాటలతో పండుగను కించపరుస్తున్న మహిళలు, యువతులు
ఇంతటి ప్రాముఖ్యత ఉన్న బతుకమ్మ పండుగను ప్రస్తుతం యువతులు మహిళలు అర్థంపర్థం లేని డీజే పాటలు పెడుతూ డాన్సులు చేస్తూ అప్రతిష్ట పాలు చేస్తూ కించపరుస్తున్నారు. ఇలా చేయడం మంచి పద్ధతి కాదని ఎందరో ప్రవచన కారులు ఆధ్యాత్మికవేత్తలు బ్రాహ్మణులు ఆయా సామాజిక మాధ్యమాల ద్వారా చెబుతున్నప్పటికీ వారి మాటలను పెడచెవిన పెడుతూ తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. చప్పట్లతో పాటలు పాడుతూ బతుకమ్మల చుట్టూ తిరిగి జరుపుకునే పండుగను కాస్త డాన్సులు చేస్తూ సాంప్రదాయానికి విరుద్ధంగా జరుపుకోవడం దారుణం. భవిష్యత్ తరాలకు బతుకమ్మ పండుగ అంటే డాన్స్ పండుగ అని చెప్పాల్సి వస్తుందేమోనని పలువురు ఆధ్యాత్మికవేత్తలు బాధపడుతున్నారు. ఒకవైపు విదేశీయులు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ వాటిని పాటిస్తూ ఉంటే, మన భారతీయులు ప్రపంచ దేశాల వింత పోకడలను అనుసరిస్తూ రోజు రోజుకు దిగజారి పోతున్నారు. ఇకనైనా తమ ధోరణి మార్చుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ పండుగలను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

