
ప్రజాధనం వృధా – పట్టించుకోని అధికారులు
అప్పుడు అలా…ఇప్పుడు ఇలా…!!
బుట్టల్లో చెత్త పోసేది ఎలా..?!
పలుచోట్ల పలగిపోయి నిరుపయోగంగా ఉన్న బుట్టలు
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి సెప్టెంబర్ 11 (ప్రజా కలం) పట్టణం పరిశుభ్రంగా ఉండాలని స్వచ్ఛ పట్టణాలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మున్సిపాలిటీ పన్నుల రూపేనా వచ్చే లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెత్త బుట్టలు నిరుపయోగంగా మారడంతో మునిసిపల్ అధికారుల అలసత్వంపై పట్టణ ప్రజల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తడి పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించాలని నిరంతరం ప్రచారం నిర్వహిస్తుండగా, వివిధ కూడళ్లు, జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో మూడు రకాల బుట్టలను ఏర్పాటు చేశారు.అయితే అధికారుల అలసత్వం, పర్యవేక్షణ లోపించి చెత్త వేసే బుట్టలు పగిలిపోయి రోజులకొద్దీ అవుతున్న చెడిపోయిన బట్టల వద్ద కొత్తగా ఏర్పాటు చేయడం విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించడంతో ఆ బుట్టలు ఇలా ఉంటే చెత్తను ఏ విధంగా వేయాలని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చాలాచోట్ల చెడిపోయిన చెత్తబుట్టలను మూలాన పడవేయడం వల్ల ప్రజలు ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తున్నారు. ఇంత జరుగుతున్న చెత్త సమస్యను పట్టించుకోకుండా మున్సిపల్ అధికారులు మొద్దు నిద్రను ప్రదర్శిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా మునిసిపల్ అధికారులు తక్షణమే స్పందించి చెత్తబుట్టలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.


