
స్పోర్ట్స్ స్కూల్ కు గుర్తింపు వచ్చేలా క్రీడాకారులను తీర్చిదిద్దాలి : క్రీడా శాఖ మంత్రి శ్రీహరి
—తూంకుంట పరిధిలోని స్పోర్ట్స్ స్కూల్ ను స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తో కలిసి సందర్శించిన క్రీడా శాఖ మంత్రి
—కుళ్ళిపోయిన కూరగాయలను చూసి అధికారులపై ఆగ్రహం…
—కాంట్రాక్టర్ ను తొలగించాలని ఆదేశం
—పాఠశాలకు నూతన బస్సును ఏర్పాటు చేస్తా : మంత్రి హామీ
శామీర్ పేట / జూలై 02 ( ప్రజా కలం ప్రతినిధి ) :
స్పోర్ట్స్ స్కూల్ కు గుర్తింపు వచ్చేలా క్రీడాకారులను తీర్చిదిద్దాలని క్రీడాల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోచ్ లకు సూచించారు. మంగళవారం శామీర్ పేట మండలం తూంకుంట పరిధిలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ను స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి తో కలిసి సందర్శించి పరిశీలించారు. క్రీడా పాఠశాలలోని మౌలిక సదుపాయాలు, కోచ్ ల వివరాలను స్పోర్ట్స్ స్కూల్ ఓ ఎస్ డి మమతను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో జరుగుతున్న క్రీడా అడ్మిషన్ల ప్రక్రియ ఏ విధంగా ఉందో గ్రౌండ్ లో తిరుగుతూ పరిశీలించారు.
కుళ్లిన కూరగాయలను చూసిన మంత్రి అధికారులపై ఆగ్రహం….
స్పోర్ట్స్ స్కూల్ సందర్శనలో భాగంగా అందులోని వంటశాలను మంత్రి పరిశీలించారు. వంటశాలలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న కూరగాయలను చూసి మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరగాయలు సప్లై చేసే కాంట్రాక్టర్ ను వెంటనే తొలగించి అతన్ని బ్లాక్ లిస్టులో పెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి విద్యార్థి కి ప్రభుత్వం ప్రతిరోజు రూ. 300 భోజనం నిమిత్తం వెచ్చిస్తుందని, ఇలాంటి నాసిరకం, కుళ్ళిన కూరగాయలను ఎందుకు పెడుతున్నారని ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో కలిసి మంత్రి సహపంక్తి భోజనం….
విద్యార్థులతో కలిసి మంత్రి మధ్యాహ్న భోజనం చేశారు. ప్రతిరోజు ఏ విధంగా భోజనం ఉంటుందో ఆయన విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ పాఠశాల క్రీడాకారుల ఉత్పత్తి కేంద్రంగా మారాలి…..
గతంలో ఈ స్పోర్ట్స్ స్కూల్ కు మంచి పేరు ప్రఖ్యాతలు ఉండేవని, ఇక్కడికి వచ్చేముందు ఈ పాఠశాల గురించి ఎంతో ఊహించానని, ఇక్కడి పరిస్థితులు వేరుగా ఉన్నాయని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ పాఠశాల క్రీడాకారుల ఉత్పత్తి కేంద్రంగా ఉండాలని ఆయన కోచ్లకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేను మాటల మంత్రిని కాదని, చేతల్లో చూపిస్తానన్నారు. గత ప్రభుత్వంలో క్రీడా పాఠశాలలను, క్రీడలను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నాతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం క్రీడాకారులమేనని, క్రీడాకారులు పడుతున్న కష్టాలు మాకు తెలుసని చెప్పారు. ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్లో క్రీడలకు రూ. 465 కోట్లు కేటాయించిందని, జీతా భత్యాలు పోగా రూ. 420 కోట్లు క్రీడా మౌలిక సదుపాయాలకు వెచ్చించడం జరుగుతుందని తెలిపారు. నేను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లోనే నూతన క్రీడా పాలసీని మంత్రివర్గం ఆమోదించిందని, 2036 లో జరిగే ఒలంపిక్స్ లక్ష్యంగా క్రీడా విధానాలు రూపొందించామని ఆయన వెల్లడించారు. మినీ బస్సు ఏర్పాటుకు మంత్రి హామీ….
ఈ సందర్భంగా స్పోర్ట్స్ స్కూల్ కు విచ్చేసిన మంత్రి దృష్టికి గత ఐదు సంవత్సరాలుగా తమ బస్సు మరమ్మత్తులకు గురైందని, కొత్త బస్సును ఏర్పాటు చేయాలని మంత్రి దృష్టికి క్రీడాకారులు తీసుకువెళ్లారు. దీంతో సానుకూలంగా స్పందించిన మంత్రి కొత్త బస్సును ఏర్పాటు చేస్తానని క్రీడాకారులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలాదేవి, ఓ ఎస్ డి మమత, జిల్లా ఆర్టిఏ సభ్యుడు జైపాల్ రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు యాదవ్, క్రీడల కోచ్ లు, తదితరులు పాల్గొన్నారు.

