
పోలీస్ విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. ఎస్సై చిరంజీవి
..పోలీస్ ల పై దాడి చేసిన వ్యక్తికి14 రోజుల జైలు…
మెట్ పల్లి(కోరుట్ల) ప్రతినిధి ఆగస్టు 20 (ప్రజా కలం)పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కోరుట్ల ఎస్సై చిరంజీవి అన్నారు. పోలీసులపై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ మేరకు ఎస్సై వివరాలు వెల్లడించారు. మంగళవారం అర్ధరాత్రి ఓచోట గొడవ జరుగుతుందని 100 నంబర్ కు ఫోన్ రావడంతో అక్కడికి వెళ్లిన కానిస్టేబుల్ ఎస్. గంగాధర్, హోంగార్డ్ ఎం.ఎ జహేద్ లపై కోరుట్ల పట్టణానికి చెందిన షేక్ యాసిన్ (25) దాడి చేసి గాయపరచగా కానిస్టేబుల్ గంగాధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు ఆయన తెలిపారు. కాగా యాసిన్ పై గతంలో రెండు మర్డర్ కేసులు ఉండగా జైలుకు కూడా వెళ్లి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఎవరైనా కోరుట్ల పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ. అర్ధరాత్రి రోడ్లపై హల్చల్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

