
ఇస్రో చరిత్రలోనే అతిభారీ ప్రయోగం
ఇస్రో చరిత్రలోనే అతిభారీ ప్రయోగం
ఎల్‌వీఎం–3 ఎం–6 గ్రాండ్ సక్సెస్
అమెరికా ‘బ్లూబర్డ్ బ్లాక్–2’ను నింగిలోకి చేర్చిన ఇస్రో
శ్రీహరికోట, డిసెంబర్ 24 ప్రజాకలం ప్రతినిధి :
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చరిత్రలోనే అతిభారీ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం **‘బ్లూబర్డ్ బ్లాక్–2’**ను మోసుకెళ్లిన ఎల్‌వీఎం–3 ఎం–6 రాకెట్ శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. కేవలం 15 నిమిషాల్లోనే ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి చేర్చడంలో ఇస్రో శాస్త్రవేత్తలు సఫలీకృతమయ్యారు.
అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా 4జీ, 5జీ మొబైల్ సేవలు అందించే సామర్థ్యం బ్లూబర్డ్ బ్లాక్–2 ఉపగ్రహానికి ఉంది. ఎల్‌వీఎం–3 రాకెట్ శ్రేణిలో ఇది 9వ విజయవంతమైన ప్రయోగం కావడం విశేషం.
ఇస్రో చైర్మన్ స్పందన
ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ ఎస్. నారాయణన్ మాట్లాడుతూ…
“బాహుబలి ప్రయోగం పూర్తిస్థాయిలో విజయవంతమైంది. ఎల్‌వీఎం ప్రయోగాల్లో ఇస్రో సంపూర్ణ విజయాలు సాధిస్తోంది. అతి తక్కువ సమయంలో రాకెట్‌ను అభివృద్ధి చేసి, అమెరికన్ కస్టమర్ అవసరాలను తీర్చగలిగాం. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రయోగాల్లో ఇది ఒకటి” అని తెలిపారు.
ఇస్రో ప్రస్తుతం 34 దేశాలకు సేవలందిస్తున్నదని, ఈ విజయం గగన్‌యాన్ కార్యక్రమానికి మరింత ఆత్మవిశ్వాసం కలిగిస్తోందని పేర్కొన్నారు. ఇస్రోపై అమెరికా పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని ఆయన స్పష్టం చేశారు.

