హద్దు మీరుతున్న ఆర్ఎంపీల వైద్యం

హద్దు మీరుతున్న ఆర్ఎంపీల వైద్యం

శంకర్ దాదాలుగా మారి..
మంగపేట (ప్రజా కలం ప్రతినిథి)

పల్లెల్లో ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా ముందుగా గుర్తొచ్చేది ఆర్ఎంపీ డాక్టర్లే. దేవుళ్లను ఎంతగా నమ్ముతారో అంతకన్నా ఎక్కువగా గ్రామాల్లో ఆర్ఎంపీలను నమ్ముతారు. కుటుంబంలో ఎవరికీ ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా ఆర్ఎంపిల దగ్గరకు పరుగెత్తుకుని వెళ్తారు. అయితే ఆ గుడ్డి నమ్మకమే ఆర్ఎంపీ డాక్టర్లకు కాసుల వర్షం కురిపిస్తుండగా కొన్నిసార్లు రోగుల ప్రాణాల మీదకు తెచ్చిపెడుతుంది. పల్లెల్లో ఆర్ఎంపిల క్లినిక్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తుండగా ఓ తెలుగు సినిమాలో చూసినట్లు అర్హత లేని శంకర్ దాదా ఎంబీబీఎస్ డాక్టర్లు ఇంజక్షన్ల దగ్గర నుండి మొదలుకొని సున్తి వంటి చిన్నపాటి ఆపరేషన్లు వరకు ఎంచక్కా చేసేస్తున్నారు. మరికొందరు అదే క్లినిక్ కు అనుబంధంగా మెడికల్ షాప్స్, పాథాలజి లాబ్స్ నిర్వహిస్తూ రోగ నిర్దారణ పరీక్షలు చేసేస్తున్నారు.
విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్ వినియోగం
కొందరు ఆర్ఎంపీ డాక్టర్లు యాంటీబయోటిక్స్‌తో పాటు స్టెరాయిడ్స్ వంటి వాటిని రోగులకు ఇస్తున్నారు అనేది బహిరంగ రహస్యమే. స్పెషలైజేషన్ చేసి అన్ని అర్హతలు ఉన్న డాక్టర్లు మాత్రమే రాయాల్సిన మందులను గ్రామాల్లో ఆర్ఎంపీలు రెఫర్ చేయడం ఆందోళన కలిగిస్తుంది. అంతటితో ఆగని కొందరు ఆర్ఎంపీలు అర్హత లేకున్న ప్రిస్క్రిప్షన్ రాయడంతో పాటు ప్రథమ చికిత్సకు వచ్చే రోగులకు ఇంజక్షన్లను ఇస్తున్నారు. ఆర్ఎంపీ ల దగ్గరికి వచ్చిన వారి ఆరోగ్య స్థితిపై పూర్తి అవగాహన లేకుండా ఇస్తున్న మందులు భవిష్యత్తులో అనేక దుష్పరిణామాలకు కారణం అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం ప్రథమ చికిత్స మాత్రమే అందించాల్సిన ఆర్ఎంపి లు పరిధికి మించి వైద్యం చేయడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రైవేట్ హాస్పిటల్స్‌తో కమిషన్ దందాలు
వరంగల్ హన్మకొండ మణుగూరు భద్రాచలం ఖమ్మం కేంద్రంగా ఉన్న కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులతో పాటుగా ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్స్, పాథాలజీ ల్యాబ్స్‌తో కుమ్మక్కు అయిన ఆర్ఎంపీలు కమిషన్ దందాలకు తెర లేపారు. ప్రథమ చికిత్సకై వచ్చిన వారికి లేని రోగాలను అంటగట్టి ప్రైవేట్ ఆస్పత్రుల పాలు చేస్తున్నారు. రోగం చిన్నదే అయినా ఆ భయాన్ని పెద్దగా చూపి లక్షల్లో గుంజుతున్నారు. ఒక్కో పేషంట్‌ను రెఫెర్ చేస్తే రోగాన్ని బట్టి 40% నుండి 60 %శాతం వరకు కమిషన్ ఆర్ఎంపీలకు ఇస్తూ మరికొందరు పేషెంట్లను తీసుకువచ్చే విధంగా యాజమాన్యాలు ప్రోత్సహిస్తున్నాయి.
కఠిన చర్యలు అవసరం
ప్రథమ చికిత్స ముసుగులో అర్హతకు మించిన వైద్యం చేస్తూ యాంటీబయాటిక్స్ స్థిరాయిడ్స్ వంటి వాటిని వాడుతున్న ఆర్ఎంపీల పట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఏదైనా అనర్థం జరిగినప్పుడే మాత్రమే మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లు రైడ్స్ చేస్తున్నారని మిగిలిన సందర్భాలలో కనీసం పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇకనైనా ఆఫీసర్లు ఇలాంటి శంకర్ దాదా ఎంబీబీఎస్‌లపై ఉక్కుపాదం మోపాలని పలువురు కోరుతున్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )