
దూసుకొచ్చి… దోచుకెళ్లారు
హైదరాబాద్‌లో రెచ్చిపోయిన దొంగలు
అసిస్టెంట్ మేనేజర్‌పై కాల్పులు – ఖజానా జ్యువెలరీలో దోపిడీ
హైదరాబాద్:
నగరంలో దొంగలు మళ్లీ రెచ్చిపోయారు. వరుసగా రెండు చోట్ల చోరీలకు పాల్పడి, నగరం మొత్తాన్ని భయభ్రాంతులకు గురి చేశారు.
కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఉదయం ఆరుగురు దొంగలు రెండు ఇళ్లలో చోరీ చేశారు. అక్కడ వృద్ధులను బెదిరించి, రూ. 2 లక్షలు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. మరో ఇంట్లోనూ దొంగతనం జరిగినట్లు సమాచారం.
ఇక చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖజానా జ్యువెలరీ షాప్‌లోనూ దోపిడీ జరిగింది. ఉదయం 10.30 గంటల సమయంలో షాప్‌లోకి దూసుకొచ్చిన ఆరుగురు నిందితులు, ప్లెడ్జ్ పనిలో ఉన్న అసిస్టెంట్ మేనేజర్ సతీష్‌పై కాల్పులు జరిపారు. బులెట్ ఆయన కాలులో దూసుకుపోయింది.
ఆకస్మిక కాల్పులతో షాప్ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. దొంగలు వెండి, బంగారు ఆభరణాలు దోచుకుని పరారయ్యారు. గాయపడిన సతీష్‌ను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ సేకరిస్తున్నారు. సీసీటీవీ ఆధారంగా నిందితులను వెంబడిస్తున్నారు. దొంగలు జహీరాబాద్ వైపు పారిపోవడంతో జిల్లా సరిహద్దు పోలీసులకు అప్రమత్తం చేశారు. నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా దాడులు చేపట్టారు

