
యూట్యూబర్ హత్య కేసులో నిందితుడు భర్త అరెస్ట్..
*యూట్యూబర్ హత్య కేసులో నిందితుడు భర్త అరెస్ట్..*
*..వివరాలు వెల్లడించిన డిఎస్పి రాములు*
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి మార్చి 18 (ప్రజా కలం) కోరుట్ల పట్టణానికి చెందిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడైన భర్తను కోరుట్ల పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కోరుట్ల పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో మెట్ పల్లి డిఎస్పి రాములు వివరాలను వెల్లడించారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం కోరుట్ల మండలం మాదాపూర్ కు చెందిన గంధం దుర్గ ప్రసాద్ రాణి దంపతుల కూతురు వైష్ణవి యూట్యూబ్ ద్వారా వీడియోలు రూపొందిస్తూ ఉండేది. ఈ క్రమంలో యూట్యూబ్ వీడియోలకు ఆకర్షితుడైన కోరుట్ల పట్టణానికి చెందిన చిత్తారి సాయిలు సాయమ్మల కుమారుడు హరిబాబు వైష్ణవి ని ప్రేమించాడు.సుమారు 10 నెలల క్రితం హరిబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి వివాహం కోసం వైష్ణవి ఇంటికి వచ్చాడు కట్నం ఇవ్వలేమని వైష్ణవి తల్లిదండ్రులు స్పష్టంగా తెలిపినా ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమ వివాహానికి దారితీసింది. అయితే హరిబాబు తల్లి లక్ష్మి కట్నం లేకుండా వివాహానికి అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి తెచ్చేందుకు హరిబాబు విషం సేవించి ఆత్మహత్యాయత్నం చేసినట్లు పేర్కొన్నారు. చికిత్స అనంతరం కోలుకున్న అతడు మళ్లీ వివాహం కోసం ఒత్తిడి చేయగా, మొదట కుటుంబం నిరాకరించింది. ఈ క్రమంలో 29-05-2025 రోజున వెంకటాపూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైష్ణవి హరిబాబు వివాహం జరిగింది. అనంతరం వైష్ణవి తల్లి గారి ఇంటిలోనే నివాసం ఉంటున్నారు. కొంతకాలం తర్వాత హరిబాబు రూ.5 లక్షల కట్నం కోరగా, ఆ మొత్తాన్ని ఇచ్చి మాధాపూర్ గ్రామంలో రెండు గుంటల భూమి కొనుగోలు చేసి ఇచ్చారు. అయినప్పటికీ మరో రూ.5 లక్షలు కోరుతూ వైష్ణవిని మానసిక, శారీరకంగా వేధించాడు. ఈ వ్యవహారంలో అతని తల్లి లక్ష్మి, అన్నలు ఆనంద్,అశోక్ లు కూడా హరిబాబు కు తోడుగా నిలిచారు. సుమారు మూడు నెలల క్రితం వైష్ణవి గర్భవతిగా ఉన్ననాటి నుండి వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో మార్చి 16 రాత్రి 11 గంటల సమయంలో వైష్ణవి, హరిబాబు గదిలో నిద్రకు వెళ్లగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. చిన్న గొడవ కావచ్చు అని భావించిన తల్లిదండ్రులు పట్టించుకోలేదు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో మళ్ళీ శబ్దాలు వినిపించాయి తలుపు తట్టినా తీయకపోవడంతో తిరిగి వెళ్ళిపోయారు. హరిబాబు ఒక్కడే 17వ తేదీ ఉదయం 6 గంటల సమయంలో బయటకు వచ్చి మొఖం గడుగుకొని తన పల్సర్ బైక్ పై బయటకు వెళ్లిపోయాడు. వైష్ణవి బయటకు రాకపోవడంతో డోర్ తీసి చూడగా వైష్ణవి రక్తపు మడుగులో పడివుండగా, నుదిటిపై గాయాలు, మెడపై గుర్తులు కనిపించాయి. వెంటనే ఆమెను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, కోరుట్లకు తరలించగా, వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు ప్రకటించారు. దీంతో పోలీసులకు పిర్యాదు చేయగా సంఘటన స్థలానికి చేరుకుని స్థలాన్ని పరిశీలించి వైష్ణవి తండ్రి దుర్గాప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా. హత్య అనంతరం హరిబాబు రాయికల్–మైతాపూర్ ప్రాంతాల్లో తిరుగుతూ, కొనరావుపేట ఎక్స్ రోడ్ సమీపంలోని ఖాళీ డబుల్ బెడ్రూమ్ ఇంటి మెట్ల కింద కత్తి, రక్తపు మచ్చలున్న దుస్తులను దాచిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు అదే రోజు సాయంత్రం 6:30 గంటలకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి ఒప్పంద ప్రకటన ఆధారంగా పంచుల సమక్షంలో రికవరీ పంచనామా నిర్వహించి, బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్, రక్తపు మచ్చలున్న కత్తి, నీలం రంగు జీన్స్ ప్యాంట్, నీలం రంగు టీ-షర్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, మిగతా నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్డీపీఓ మెట్ పల్లి ఏ. రాములు, కోరుట్ల సిఐ బి సురేష్ బాబు, ఎస్సై చిరంజీవి తెలిపారు.

