రాష్ట్రపతి నిలయంలో ప్రారంభమైన ‘ఉద్యాన్ ఉత్సవ్ 2026

రాష్ట్రపతి నిలయంలో ప్రారంభమైన ‘ఉద్యాన్ ఉత్సవ్ 2026

హైదరాబాద్ జనవరి 3( ప్రజాకలం ప్రతినిది)
‘ప్రజా భాగస్వామ్యం, సుస్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించనున్న ఉద్యాన్ ఉత్సవ్ 2026
గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శీతాకాల విడిది కేంద్రమైన రాష్ట్రపతి నిలయంలో 2026 జనవరి 3 నుంచి జనవరి 11 వరకు ‘ఉద్యాన్ ఉత్సవ్ 2026’ జరగనుంది. పర్యావరణ అవగాహన, ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు చర్యల్లో భాగంగా ఈ రెండో విడత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వ్యవసాయంలో పెరుగుతున్న మహిళల నాయకత్వానికి ప్రతీకగా శ్రీమతి సీహెచ్. సృజన, శ్రీమతి కోసిరెడ్డి లావణ్య రమణారెడ్డి అనే ఇద్దరు అభ్యుదయ మహిళా రైతులు ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ‘మేనేజ్’ డైరెక్టర్ జనరల్ ఐపీఓఎస్ డాక్టర్ సాగర్ హనుమాన్ సింగ్, రాష్ట్రపతి భవన్ ప్రజా సంబంధాల అధికారి శ్రీ కుమార్ సమరేష్, రాష్ట్రపతి కార్యాలయం అధికారి డాక్టర్ కే. రజనీ ప్రియ, ‘మేనేజ్’ డైరెక్టర్ డాక్టర్ శాలేంద్ర హాజరయ్యారు.‘మేనేజ్’ సహకారంతో వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో రాష్ట్రపతి ప్రాంగణాలను ప్రజా  భాగస్వామ్యం, పర్యావరణ స్పృహకు శక్తిమంతమైన కేంద్రాలుగా మార్చాలనే గౌరవనీయులైన భారత రాష్ట్రపతి దార్శనికతకు అనుగుణంగా ‘ఉద్యాన్ ఉత్సవ్ 2026’ నిర్వహిస్తున్నారు. వ్యవసాయ ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, విలువ జోడింపు కోసం ఒక సమగ్ర వేదికను అందిస్తూ సుమారు 120 మంది ప్రదర్శనకారులతో కూడిన 50 థిమాటిక్ స్టాల్స్ ఈ ఉత్సవంలో ఉన్నాయి. 59 రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీఓ) ఉత్పత్తులతో ప్రజలను నేరుగా అనుసంధానించే ‘ఫామ్-టు-ఎంటర్‌ప్రైజ్ జోన్’.. నర్సరీ మొక్కలు, జీవ ముడి పదార్థాలను అందించే ‘ప్లాంట్ అండ్ ప్రొడ్యూస్ జోన్’.. గిరిజన హస్తకళలు, జీఐ-ట్యాగ్ ఉన్న ఉత్పత్తులు- సేంద్రీయ ఉత్పత్తులను ప్రదర్శించే ‘ఎకో బజార్’, పోషక విలువలు గల ఉత్పత్తులను ప్రోత్సహించే ‘మిల్లెట్ మండి, అంకుర హబ్’.. అధునాతన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించే ‘హరిత విజ్ఞాన కేంద్రం’ వంటివి ఇక్కడి ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. వచ్చే తొమ్మిది రోజులు (2026 జనవరి 3 – 11) ఉదయం 10:00 గంటల నుంచి రాత్రి 8:00 గంటల వరకు ఉద్యాన్ ఉత్సవ్- 2026‌ను ప్రజలు ఉచితంగా సందర్శించవచ్చు. ఇక్కడ అన్ని ప్రాంతాల నుంచి పాఠశాల విద్యార్థులు, ప్రజలు, అభ్యుదయ రైతులు, ఇతర భాగస్వాములు ప్రారంభోత్సవంలో ఉత్సహంగా పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )