
ప్రజా కలం చెప్పిందే నిజమైంది !
ప్రజా కలం చెప్పిందే నిజమైంది !
– డైలామా లో స్థానిక ఎన్నికల పోరు అనే కథనంతో గత నెల 30న వార్త కథనం ప్రచురితం
– బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పైన కూడా స్టే విధించిన హై కోర్టు
– నెలరోజుల పాటు నిలిచిపోనున్న ఎన్నికల ప్రక్రియ
హైదరాబాద్, ఎల్లారెడ్డి అక్టోబర్ 09 ప్రజా కలం :
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై సెప్టెంబర్ 30వ తేదీన ప్రజాకలం దినపత్రికలో డైలమాలో స్థానిక ఎన్నికల పోరు అనే కథనంతో వార్త కథనం ప్రచురితమైంది. ప్రజా కలం దినపత్రిక చెప్పినట్లుగానే ఈరోజు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్థానిక ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధించింది. జీవో అమలు ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాల దాఖలుకు పిటిషనర్లకు రెండు వారాల గడువు విధించింది. తదుపరి విచారణ వారాలకు వాయిదా వేసింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పైన కూడా హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ ఆరు వారాల పాటు నిలిచిపోనుంది.
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో రెండు రోజులపాటు సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. బీసీ కులగనణ కు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిందని, స్వాతంత్రం తర్వాత సమగ్ర కులగనణ సర్వే తెలంగాణలోనే జరిగిందని అన్నారు. ఇంటింటికి వెళ్లి సర్వే చేశారని ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో బీసీ జనాభా 57.6% ఉన్నట్లు తేలిందన్న ఆయన 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఏకగ్రీవంగా నిర్వహించినట్లు కోర్టుకు తెలిపారు. బీసీల్లో రాజకీయ వెనుకబాటుతనం ఉందని గుర్తించే అసెంబ్లీ తీర్మానం చేసిందన్నారు.
బగ్గుమన్న బీసీ సంఘాలు రాష్ట్ర బంద్కు పిలుపు.
స్థానిక ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుతో పాటు ఎన్నికల నోటిఫికేషన్ పై కూడా హైకోర్టు ఆరు వారాల పాటు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్రంలో బీసీ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు తీర్పు వెలువరించిన వెంటనే రాష్ట్ర రాజధాని లోని హైకోర్టు ఎదుట బీసీ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునిస్తున్నట్లు వారు తెలిపారు.

