షటిల్ క్లబ్ భవనం కూల్చింది ఎవరు..?

షటిల్ క్లబ్ భవనం కూల్చింది ఎవరు..?

– ప్రభుత్వ నిధులతో భవన నిర్మాణం
– మెట్ పల్లి క్లబ్ రిజిస్ట్రేషన్ తర్వాత నేలమట్టమైన భవనం
– కూల్చడం వెనక ప్రభుత్వ అనుమతి ఉందా లేదా..?
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి, జూలై 30 (ప్రజాకలం) : మెట్ పల్లి క్లబ్ ఆస్తుల విక్రయం, రిజిస్ట్రేషన్ వ్యవహారం ఓవైపు చర్చనీయాంశ మవుతుండగా మరో వైపు మెట్ పల్లి క్లబ్ ఆవరణలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన షటిల్ క్లబ్ ను ఆగమేఘాల మీద కూల్చేసిన ఘటన మరో హాట్ టాపిక్ గా మారుతోంది. సుమారు గత పక్షం రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా మెట్ పల్లి క్లబ్ ఆస్తుల అమ్మకం వ్యవహారం దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే షటిల్ క్లబ్ ను కూల్చివేసి అక్కడి భూమిని చదును చేయడం చర్చనీయాంశం అవుతుంది.

మెట్ పల్లిలో 2003లో అప్పటి కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి, మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు, అప్పటి ఎమ్మెల్యే దివంగత వెంకటరమణారెడ్డి, జడ్పి చైర్మన్ కే.వి రాజేశ్వరరావు, ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ చైర్మన్, ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, సర్పంచ్ సాంబారి ప్రభాకర్ ల చేతుల మీదుగా ఈ ఇండోర్ షటిల్ క్లబ్ భవనాన్ని ప్రారంభించారు. కొన్ని రోజులు క్రీడ వినోదం కోసం ఇండోర్ షటిల్ క్లబ్ ఇక్కడికి వచ్చే ప్రజలకు ఎంతగానో ఉపయోగపడింది. అనూహ్యంగా మెట్ పల్లి క్లబ్ ఆస్తుల విక్రయం, రిజిస్ట్రేషన్ తతంగం పూర్తి కావడం ఆ వెంటనే ఇండోర్ షటిల్ క్లబ్ కూల్చివేయడం చక చకా జరిగిపోయాయి. అయితే ఈ షటిల్ క్లబ్ నిర్మాణం ప్రభుత్వ నిధులతో జరిగింది. సుమారు గత 12 సంవత్సరాల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ఇక్కడ ప్రజల సౌకర్యార్థం షటిల్ క్లబ్ నిర్మాణం చేపట్టింది. ఇన్ని రోజులు బాగానే ఉన్నప్పటికీ కొంతమంది సభ్యుల దురాలోచన కారణంగా మెట్ పల్లి క్లబ్ ఆస్తులను విక్రయించి రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు షటిల్ క్లబ్ ను కూల్చివేసిన ఘటన కొంతమేర వివాదస్పదం అయ్యే ఆస్కారం ఉన్నది. ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాన్ని కూల్చివేయాలంటే ముందుగా సంబంధిత శాఖ ప్రభుత్వ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ అధికారులు భవనాన్ని పరిశీలించి కూల్చివేయాల వద్దా అన్నది నిర్ణయించి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ భవన నిర్మాణాన్ని ఎలాంటి ప్రభుత్వ అధికారులు అనుమతి లేకుండానే కొంతమంది క్లబ్ సభ్యులు ఉన్నఫలంగా కూల్చివేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ భవనం అని తెలిసినప్పటికీ దాన్ని కూల్చివేయాలన్న ఆలోచన వెనుక ఎవరి హస్తం ఉందోనన్న అనుమానం తీవ్రంగా వ్యక్తమవుతోంది. ఓవైపు మెట్ పల్లి క్లబ్ ఆస్తుల విక్రయం, రిజిస్ట్రేషన్ వ్యవహారంపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు విచారణ జరుగుతోంది. మరోవైపు షటిల్ క్లబ్ ను ఎందుకు కూల్చివేశారు అన్న విషయం పైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఉన్నత స్థాయి అధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కొంతమంది క్లబ్ సభ్యులు కోరుతున్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )