కర్ల రాజేష్ మృతిపై రీ పోస్టుమార్టం ఎందుకు చేయడం లేదు? – మంద కృష్ణ మాదిగ ప్రశ్న

కర్ల రాజేష్ మృతిపై రీ పోస్టుమార్టం ఎందుకు చేయడం లేదు? – మంద కృష్ణ మాదిగ ప్రశ్న

కర్ల రాజేష్ మృతిపై రీ పోస్టుమార్టం ఎందుకు చేయడం లేదు? – మంద కృష్ణ మాదిగ ప్రశ్న

© పోలీసుల మీద మా వాదనలు తప్పైతే మా మీద కేసు పెట్టండి.

© మా ప్రశ్నలపై పోలీసుల మౌనం వారి నేరాన్ని స్పష్టంగా బయటపెడుతుంది.

© మరియమ్మ లాకప్ డెత్ విషయంలో కేసీఆర్ స్పందించినంత మెరుగ్గా రాజేష్ లాకప్ డెత్ విషయంలో రేవంత్ రెడ్డి స్పందించ లేదు.

© త్వరలోనే రేవంత్ కు లేఖ రాస్తాం..అపాయింట్ మెంట్ కోరుతాం.

© వారం రోజుల్లో హైదరాబాద్ లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తాం.

హైదరాబాద్, సోమాజిగూడ మార్చి 6: ప్రజాకలం ప్రతినిధి  పోలీసుల చిత్రహింసల వల్ల ప్రాణాలు కోల్పోయిన దళిత యువకుడు కర్ల రాజేష్ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయడానికి పోలీసు శాఖ ఎందుకు జంకుతోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు. రీ పోస్టుమార్టం చేయాలని తాము లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు.

సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కర్ల రాజేష్ మరణానికి పోలీసులు కారణమని దాదాపు 90 రోజులుగా చెబుతున్నప్పటికీ ఇప్పటివరకు పోలీసు శాఖ నుంచి ఎలాంటి వివరణ లేదా ఖండన రాలేదన్నారు. తమ వాదనలు తప్పైతే పోలీసు అధికారులు తమపై కేసులు పెట్టవచ్చని, చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని అన్నారు. అయితే పోలీసులు మౌనం పాటించడం వారి తప్పును స్పష్టంగా బయటపెడుతోందని వ్యాఖ్యానించారు.

ఈ ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ డీజీపీ, చీఫ్ సెక్రటరీలకు నోటీసులు పంపి రీ పోస్టుమార్టం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించినప్పటికీ 50 రోజులు గడిచినా అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. పోలీసులు నిజాయితీగా ఉంటే రీ పోస్టుమార్టం చేయడానికి భయమెందుకని ప్రశ్నించారు. రీ పోస్టుమార్టం జరిగితే అసలు కారణాలు బయటపడతాయనే భయంతోనే అధికారులు వెనుకడుగు వేస్తున్నారని ఆరోపించారు.

రాజేష్ మరణాన్ని గుండెపోటుగా చూపించేలా పోస్టుమార్టం నివేదికను మార్చేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. సూర్యాపేట ఎస్పీ రీ పోస్టుమార్టం జరగకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు. వెంటనే సూర్యాపేట ఎస్పీని బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.

ఇక గతంలో మరియమ్మ లాకప్ డెత్ ఘటనలో అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వెంటనే స్పందించి బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేసి బాధిత కుటుంబానికి పరిహారం, ఉద్యోగం కల్పించారని గుర్తుచేశారు. కానీ రాజేష్ లాకప్ డెత్ జరిగి మూడు నెలలు అవుతున్నా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించలేదని విమర్శించారు.

ఈ ఘటనపై డీజీపీ కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని, జరిగిన తప్పును సరిదిద్దే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. ఇలాంటి చర్యల వల్ల పోలీసు శాఖ ప్రతిష్ట దెబ్బతింటుందని అన్నారు.

ఈ అంశంపై త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసి అపాయింట్‌మెంట్ కోరనున్నట్లు తెలిపారు. అలాగే హైదరాబాద్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఫిబ్రవరి 28న ‘చలో సూర్యాపేట’ పేరుతో ప్రజా ఆగ్రహ మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డా. గోవిందు నరేష్ మాదిగ, హైకోర్టు న్యాయవాది దున్న అంబేద్కర్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు టీవీ నరసింహ తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )