
దసరాకు ఊరెళ్తున్నారా..
దసరాకు ఊరెళ్తున్నారా..
ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండండి!
ప్రజల సహకారంతోనే నేరాల నివారణ సాధ్యం
జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యా ప్రతినిధి అక్టోబర్ 9 (ప్రజా కలం)
జగిత్యాల జిల్లా దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజలు ఇళ్ల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. పండుగ సెలవులను ఆసరాగా చేసుకుని దొంగలు ఇళ్లలో చోరీలకు పాల్పడే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో చోరీల నివారణకు పోలీసు శాఖ తరఫున అవసరమైన చర్యలు చేపడుతున్నామని, రాత్రి వేళల్లో పోలీసు గస్తీని ముమ్మరం చేసినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలను గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఇళ్ల భద్రతకు పోలీసుల సూచనలు
ఇంటికి తాళం వేసినప్పుడు తాళంల్ బయటకు కనిపించకుండా జాగ్రత్తపడాలి. వీలైతే ప్రధాన ద్వారాన్ని లోపలి నుంచి లాక్ చేసే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.ఊరికి వెళ్లే ముందు బంగారం, వెండి, నగదు వంటి విలువైన వస్తువులను ఇంట్లో సాధారణంగా కనిపించే ప్రదేశాల్లో ఉంచకూడదు. సురక్షితమైన లాకర్లలో భద్రపరచాలన్నారు.బీరువా తాళాలను ఇంట్లోని కప్బోర్డుల్లో లేదా ఇతర సులభంగా గుర్తించగల ప్రదేశాల్లో ఉంచకూడదన్నారు. ప్రయాణ వివరాలు, ఇంట్లో లేని సమయం, విలువైన వస్తువులకు సంబంధించిన సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దన్నారు.ఊరికి వెళ్లే విషయాన్ని నమ్మకమైన ఇరుగుపొరుగు వారికి తెలియజేసి, ఇంటిపై నిఘా ఉంచాలన్నారు. అవసరమైతే స్థానిక పోలీసులకు కూడా సమాచారం ఇవ్వాలన్నారు.రాత్రివేళ ఇంట్లో ఒక గదిలో లైట్ వెలిగేలా ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ఇంటి చుట్టూ అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.ఇంటి భద్రత కోసం మొబైల్కు నోటిఫికేషన్లు వచ్చేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని,వీలైనంత వరకు ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలు కెమెరాల్లో కనిపించేలా చూడాలన్నారు.ఇంట్లో ఒంటరిగా ఉండే మహిళలు, వృద్ధుల వద్దకు అపరిచితులు వచ్చి సమాచారం అడిగినా, ఇతర కారణాలు చెప్పినా అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించాలని పేర్కొన్నారు.దసరా పండుగను సంతోషంగా జరుపుకునేందుకు ప్రజలు పోలీసుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అశోక్ కుమార్ కోరారు.

