
మీడియా స్వేచ్ఛకు రక్షణ… అదుపు కోసం స్వతంత్ర ప్రెస్ కౌన్సిల్ అవసరం
మీడియా స్వేచ్ఛకు రక్షణ… అదుపు కోసం స్వతంత్ర ప్రెస్ కౌన్సిల్ అవసరం
స్వేచ్ఛ–బాధ్యతలు కలగలిసినప్పుడే ఆరోగ్యకర మీడియా వ్యవస్థ: దేవులపల్లి అమర్
హైదరాబాద్, నవంబర్ 16 (ప్రజాకలం ప్రతినిధి):
మీడియా స్వేచ్ఛతో పాటు మీడియాను ప్రభుత్వ జోక్యం లేకుండా నియంత్రించేందుకు ప్రెస్ కౌన్సిల్ వంటి స్వతంత్ర సంస్థలు అత్యంత అవసరమని సీనియర్ సంపాదకులు దేవులపల్లి అమర్ అభిప్రాయపడ్డారు. నాంపల్లి తెలంగాణ మీడియా అకాడమి ఆడిటోరియంలో సమాచార–పౌర సంబంధాల శాఖ, తెలంగాణ మీడియా అకాడమి సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ పత్రికా దినోత్సవం (నేషనల్ ప్రెస్ డే) కార్యక్రమం జరిగింది.

జ్యోతి ప్రజ్వలన అనంతరం ప్రసంగించిన అమర్—
“సమాజంలో మీడియా పేరుతో జరుగుతున్న దుష్టప్రయోగాలను ఎండగట్టాలి. పత్రికా నైతికతను కాపాడాలి. నెహ్రూ సూచనలతో ఏర్పడిన తొలి ప్రెస్ కమిషన్, 1966లో ఏర్పడ్డ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జర్నలిజం విలువలను రక్షించేందుకు కీలకం” అన్నారు. ప్రెస్ కౌన్సిల్ ఏర్పడిన రోజునే జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకోవడం సంప్రదాయమైందని గుర్తు చేశారు.
“తప్పుడు వార్తలు ప్రచారం… మొత్తం మీడియా మీద మచ్చ”
కొన్ని పత్రికలు, ఛానెల్స్ నైతిక నియామావళిని పాటించకపోవడం వల్ల మీడియా మొత్తం వివాదాలకు లోనవుతుందని అమర్ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సంస్థలు, సంఘాలు ఒక తాటిపైకి వచ్చి విశ్వాసం పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
సోషల్ మీడియా నియంత్రణకు చట్టాలు అవసరం
సోషల్ మీడియాలో పెరుగుతున్న అవకతవకలను అరికట్టేందుకు కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని ఆయన సూచించారు.

జర్నలిస్టుల రక్షణపై చర్యలు తప్పనిసరి
జర్నలిస్టులపై దాడులను తగ్గించేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ‘మీడియా కౌన్సిల్ ఆఫ్ ఇండియా’గా మార్పు చేయాలని మీడియా సంస్థలు, సంఘాలు కృషి చేయాలన్నారు. గత రెండేళ్లుగా ప్రెస్ కౌన్సిల్ పాలకవర్గం లేకపోవడం ఆందోళనకరమని, వెంటనే నియమించాలని విజ్ఞప్తి చేశారు.
జర్నలిస్టుల సంక్షేమంపై చర్చలు
జర్నలిస్టుల సంఘాల ప్రతినిధులు మారుతి సాగర్, మాజీద్, బసవ పున్నయ్య, రమణారావు, రంగసాయి, యూసుఫ్ బాబు, రమణ కుమార్, సువర్ణ తదితరులు జర్నలిస్టుల సంక్షేమానికి అవసరమైన సూచనలు, సలహాలు అందించారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
కార్యక్రమానికి సమాచార–పౌర సంబంధాల శాఖ అడిషనల్ డైరెక్టర్ డి.ఎస్. జగన్ అధ్యక్షత వహించారు. జాయింట్ డైరెక్టర్ కె. వెంకట రమణ, మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు, అధికారులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.

