
కొత్త చరిత్ర సృష్టించండి.
కొత్త చరిత్ర సృష్టించండి.
– గ్రూప్-1 అధికారులకు హైడ్రా కమిషనర్ దిశానిర్దేశం
హైదరాబాద్, మార్చి 20 (ప్రజా కలం): అధికారులపై ప్రజలకు నమ్మకం కలిగేలా ప్రతి చర్య పారదర్శకతతో ఉండాలని, ప్రజా ప్రయోజనమే పరమావధిగా పని చేస్తూ మీ విభాగాల్లో కొత్త చరిత్ర సృష్టించాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పిలుపునిచ్చారు. శుక్రవారం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD)లో శిక్షణ పొందుతున్న గ్రూప్-1 అధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అధికారులు కేవలం నిబంధనలను ఫాలో అవ్వడమే కాకుండా, క్షేత్రస్థాయిలో ఫలితాలు చూపి తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవాలని సూచించారు. చట్టాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా కఠినంగా అమలు చేసినప్పుడే వ్యవస్థపై ప్రజలకు గౌరవం పెరుగుతుందని రంగనాథ్ స్పష్టం చేశారు. గతంలో ఎన్-కన్వెన్షన్ కూల్చివేత, ప్యాట్నీ నాలా ఆక్రమణల తొలగింపు వంటి విషయాల్లో స్పష్టమైన ఉల్లంఘనలు ఉన్నా చర్యలు ఉండేవి కావని, హైడ్రా ఆ ఒరవడిని మార్చిందని గుర్తు చేశారు. నగరంలో ఇప్పటికే 3 చెరువులను పునరుద్ధరించామని, మరో 22 చెరువులను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. కాలువల పూడికతీత వల్ల గత వర్షాకాలంలో నగరానికి వరద ముప్పు తప్పిందని, ఆక్రమణలు తొలగించినప్పుడు విమర్శించిన వారే ఇప్పుడు ప్రశంసిస్తున్నారని పేర్కొన్నారు. హైడ్రా ప్రారంభంలో సోషల్ మీడియాలో 70 శాతం నెగిటివిటీ ఉండేదని, కానీ పారదర్శకమైన పనితీరు వల్ల ప్రస్తుతం 85 శాతం మంది ప్రజలు సానుకూల దృక్పథంతో ఉన్నారని కమిషనర్ వివరించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడానికి ప్రజావాణి ఎంతో ఉపయోగపడుతుందని, ప్రజల మద్దతు ఉంటే పరిపాలన సులభమవుతుందని హితవు పలికారు. ఏ బాధ్యత అప్పగించినా నిబద్ధతతో పనిచేయడమే తన విధానమని, నూతన అధికారులు కూడా అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని రంగనాథ్ దిశానిర్దేశం చేశారు.

