
కుటుంబ కలహాలకు భార్య బలి
కుటుంబ కలహాలకు భార్య బలి
చున్నీతో మెడ బిగించి హత్య చేసిన భర్త
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి సెప్టెంబర్ 16 (ప్రజా కలం):
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భర్త తన భార్యను చున్నీతో మెడ బిగించి హత్య చేసిన ఘటన బుధవారం ఉదయం కలకలం రేపింది. కోరుట్ల పట్టణంలోని ప్రకాశం రోడ్డులో నివాసముంటున్న అన్నం నరేశ్, లక్ష్మి దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు జరుగుతున్నట్లు సమాచారం. నరేష్ కథలాపూర్ సబ్స్టేషన్లో వాచ్మెన్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం భార్యాభర్తల మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ తారస్థాయికి చేరడంతో నరేశ్ క్షణికావేశంలో భార్య లక్ష్మి మెడకు చున్నీ బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న కోరుట్ల పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు దర్యాప్తులో వెల్లడించాల్సి ఉంది.

