
గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు
గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు
కోరుట్ల పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల ప్రతినిధి సెప్టెంబర్ 19 (ప్రజాకలం)
జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పనితీరు, నేరాల దర్యాప్తు పురోగతి, ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించే క్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శనివారం కోరుట్ల పట్టణంలోని పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ రికార్డుల నిర్వహణ, బీట్ వ్యవస్థ అమలు, రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా తదితర అంశాలను ఎస్పీ సమీక్షించారు. స్టేషన్ పరిసరాల పరిశుభ్రతతో పాటు ప్రజలకు అందుతున్న పోలీస్ సేవలపై ప్రత్యేకంగా ఆరా తీశారు.ప్రస్తుతం జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. గణేష్ మండపాల వద్ద భద్రతా చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తూ, మండపాల నిర్వాహకులతో సమన్వయం చేసుకుని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. గణేష్ విగ్రహాల ఊరేగింపు మార్గాలను ముందుగానే పరిశీలించి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నేరాల నియంత్రణలో భాగంగా విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై నిఘా ఉంచాలని ఎస్పీ అన్నారు. పాత నేరస్తుల కదలికలను నిరంతరం గమనిస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేసి చోరీలు, గంజాయి అక్రమ రవాణా, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై కఠిన నిఘా కొనసాగించాలని ఆదేశించారు. ముఖ్యంగా యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఎస్పీ వెంట కోరుట్ల సీఐ లక్ష్మీనారాయణ, ఎస్ఐ శ్యామ్ రాజ్ ఉన్నారు.

