
వృద్ధులను లక్ష్యంగా చేసుకున్న అంతర్జిల్లా దొంగల ముఠా అరెస్ట్
వృద్ధులను లక్ష్యంగా చేసుకున్న అంతర్జిల్లా దొంగల ముఠా అరెస్ట్
24 గ్రాముల బంగారు గొలుసు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం
– కోరుట్ల పోలీసుల చాకచక్యం
మెట్ పల్లి(కోరుట్ల) ప్రతినిధి జులై 21 (ప్రజా కలం): అమాయక ప్రజలను, ముఖ్యంగా వృద్ధులను లక్ష్యంగా చేసుకుని దృష్టి మళ్లించి బంగారు ఆభరణాలు అపహరిస్తున్న అంతర్జిల్లా దొంగల ముఠాను కోరుట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు 24 గ్రాముల బరువున్న లక్ష్మీదేవి బిళ్లల బంగారు గొలుసుతో పాటు రెండు మొబైల్ ఫోన్లు (రియల్మీ, శాంసంగ్) స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అల్లెపు కృష్ణ, కుంచెపు శ్రీకాంత్, అల్లెపు రాజ్‌కుమార్‌గా గుర్తించారు. వీరంతా సిద్దిపేట జిల్లాకు చెందినవారని పోలీసులు తెలిపారు. సిద్దిపేట ప్రాంతంలో గుర్తుపడే అవకాశం ఉండటంతో ఇతర ప్రాంతాల్లో దొంగతనాలు చేయాలనే ఉద్దేశంతో జూలై 15న కోరుట్లకు వచ్చి స్థానిక లాడ్జిలో బస చేసినట్లు విచారణలో వెల్లడైంది.జూలై 16న కోరుట్ల బస్టాండ్ పరిసరాల్లో సంచరిస్తూ సుమారు 70 ఏళ్ల వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్నారు. ఆమెకు పెన్షన్‌ను రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు పెంచిస్తామని నమ్మించి, అనంతరం ఎస్బీఐ బ్యాంకు సమీపానికి తీసుకెళ్లారు. బంగారు ఆభరణాలు ధరించి ఉంటే పెన్షన్ రాదని నమ్మబలికి ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించినట్లు పోలీసులు తెలిపారు.మరిన్ని దొంగతనాలకు పాల్పడే ఉద్దేశంతో నిందితులు కోరుట్లలోని లాడ్జిలోనే ఉండగా, సమాచారం ఆధారంగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 24 గ్రాముల బంగారు గొలుసు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని చట్టపరమైన పంచనామా నిర్వహించారు.
విచారణలో ప్రధాన నిందితుడు అల్లెపు కృష్ణపై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో 100కు పైగా కేసులు నమోదైనట్లు, మిగతా ఇద్దరు నిందితులపై కూడా అనేక దొంగతనాల కేసులు ఉన్నట్లు వెల్లడైందని పోలీసులు తెలిపారు.నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

