బీజేపీలో భగ్గుమన్న అంతర్గత పోరు

బీజేపీలో భగ్గుమన్న అంతర్గత పోరు

*దుగ్యాల ప్రదీప్ నియంతృత్వంపై ప్రభారీలు తీవ్ర ఆగ్రహం
*జిల్లా అధ్యక్షుని ఆమోదం లేని కమిటీలు చెల్లవన్న ప్రభారీలు
పెద్దపల్లి,జులై 06:(ప్రజాకలం జిల్లా ప్రతినిధి)
పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం ప్రకటించిన మండల మరియు పెద్దపల్లి మున్సిపల్ కమిటీలపై భారతీయ జనతా పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా అధ్యక్షుని సమ్మతి లేకుండా ప్రకటించిన ఈ కమిటీలు చెల్లవని వివిధ మండలాల ప్రభారీలు స్పష్టం చేశారు.పెద్దపల్లి,ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాలతో పాటు పెద్దపల్లి మున్సిపల్ కమిటీలను ఆయా అధ్యక్షులు ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో మండల ప్రభారీలు పత్రికా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ కేంద్ర పార్టీ నిర్ణయం మేరకు దేశంలో సంఘటన సంరచన ద్వారా మండల కమిటీలను నియమించడం జరుగుతుందని తెలిపారు.దీనికి సంబంధించి మండల అధ్యక్షులు,మండల ప్రభారీలు కమిటీని ఏర్పాటు చేసి,దానిని జిల్లా అధ్యక్షుని ఆమోదంతో ప్రకటించాల్సి ఉంటుందని వారు గుర్తు చేశారు.అయితే, దుగ్యాల ప్రదీప్ కుమార్ తన సొంత పార్టీలా వ్యవహరిస్తూ, నియంతృత్వ ధోరణిలో పెద్దపల్లి నియోజకవర్గంలో తనకు నచ్చిన రీతిలో పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని ప్రభారీలు ఆరోపించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి అమ్ముడుపోయి,డబ్బులు తీసుకొని పార్టీని భ్రష్టు పట్టించారని దుగ్యాల ప్రదీప్ కుమార్‌పై విమర్శలు గుప్పించారు.130 గ్రామాలు ఉన్న నియోజకవర్గంలో కేవలం 10 నుండి 20 గ్రామాలే పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారని పేర్కొన్నారు.పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కర్రె సంజీవరెడ్డిని అడుగడుగునా అడ్డుకుంటూ,ఆయనకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రభారీలు మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి వద్ద డబ్బులు తీసుకొని నియోజకవర్గంతో తనకు సంబంధం లేదన్నట్టు ముఖం చాటేశారని దుగ్యాల ప్రదీప్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.తాను ప్రత్యక్షంగా పోటీ చేసిన ఎమ్మెల్యే ఎన్నికల్లో సొంత గ్రామంలోని సొంత బూత్‌లో కేవలం 20 ఓట్లకే పరిమితమైన దుగ్యాల ప్రదీప్ కుమార్, పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ పటిష్టతకు చేసిన కృషి ఏంటిదని,అలాగే పార్టీని భ్రష్టు పట్టించడానికి చేసిన ప్రోత్సాహం ఎంత అని ప్రశ్నించారు.జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డిని అడుగడుగునా అడ్డుకుంటూ వారికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ,కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ని విమర్శిస్తూ కరీంనగర్‌లో దుగ్యాల ప్రదీప్ కుమార్ తన అనుచరగణంతో పత్రికా సమావేశం పెట్టడం నిజం కాదా అని నిలదీశారు.ఇకనైనా ప్రదీప్ కుమార్ బుద్ధి తెచ్చుకొని పార్టీని అభాసుపాలు చేసే ఇలాంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఆపాలని హెచ్చరించారు. కార్యకర్తల పైన కేసులు పెట్టించడం,వారి మధ్య గొడవలు పెట్టించడం దుగ్యాల ప్రదీప్ కు వెన్నతో పెట్టిన విద్య అని ప్రభారీలు తెలియజేశారు.అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి కనుమరుగైన ప్రదీప్ కుమార్,కేవలం తాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండడం ఆ పదవిని తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటూ తన ఆదేశాలతో నియోజకవర్గంలో కార్యక్రమాలను నిర్వహించడం తన నియంతృత్వ,కులహంకార ధోరణికి నిదర్శనమని ప్రభారీలు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జంగ చక్రధర్ రెడ్డి,కంకణాల జ్యోతిబసు,గర్రపెల్లి నారాయణస్వామి,పల్లె సదానందం,కొమ్ము తిరుపతి,రామినేని రాజేంద్రప్రసాద్,పర్స సమ్మయ్య,మటం నర్సింగం,వెల్లంపల్లి శ్రీనివాస్,బెజ్జంకి దిలీప్,కారంగుల నవీన్,అనిల్ తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )