
పార్టీ ప్రతిష్టతను అధిష్టానం
పార్టీ ప్రతిష్టతను అధిష్టానం కాపాడాలి..కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జెట్టి లింగం, సీనియర్ నాయకులు మహ్మద్ షాకీర్ సిద్ధికి, మాన్కల గంగాధర్, ..
..నాయకత్వ లోపంపై సీనియర్ల ధ్వజం
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి ఏప్రిల్ 27 (ప్రజా కలం) నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోందని, పార్టీ పటిష్టత కోసం అధిష్టానం తక్షణ చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జెట్టి లింగం, సీనియర్ నాయకులు మహ్మద్ షాకీర్ సిద్ధికి,మాన్కల గంగాధర్ లు డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా కోమిరెడ్డి జ్యోతి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇప్పటి వరకు పార్టీకి విజయం దక్కకపోవడం ఆవేదనకరమని పేర్కొన్నారు. వరుస ఓటమిలకు స్పష్టమైన నాయకత్వ లోపమే కారణమని విమర్శించారు. ఇటీవల మెట్‌పల్లి మున్సిపల్ కో- ఆప్షన్ ఎన్నికల్లో పార్టీ వ్యవహరించిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ప్రతిపక్ష బిఆర్ఎస్ అభ్యర్థికి కాంగ్రెస్ కౌన్సిలర్లు మద్దతు ఇవ్వడం పార్టీ బలహీనతను బహిర్గతం చేసిందని మండిపడ్డారు. సొంత అభ్యర్థిని గెలిపించుకోలేని పరిస్థితి పార్టీ అంతర్గత విభేదాలకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు.పార్టీకి అధిష్టానం ఉన్నదా? ఉంటే ఇలాంటి పరిణామాలు ఎలా చోటుచేసుకుంటున్నాయి? అంటూ నేతలు ప్రశ్నించారు. రాబోయే నామినేటెడ్ పదవులను నలభై సంవత్సరాలుగా పార్టీకి సేవలందిస్తున్న సీనియర్ నాయకులకే కేటాయించాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారిని పక్కనబెట్టి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వలస నేతలకు పదవులు ఇవ్వడం తగదని హెచ్చరించారు.కోమిరెడ్డి జ్యోతి విజయం తర్వాత ప్రజల్లో ఆదరణ పొందే నాయకత్వం లేకపోవడంతో పార్టీ మూడో స్థానానికి పడిపోయిందని విశ్లేషించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 26 వార్డుల్లో కేవలం 6 స్థానాలకు మాత్రమే పరిమితమవడం పార్టీ బలహీనతను స్పష్టంగా చూపుతోందని పేర్కొన్నారు.నలభై ఏళ్లుగా కృషి చేసిన సీనియర్ కార్యకర్తలు గుర్తింపు లేక ఇంటికే పరిమితమవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇకనైనా ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెంటనే స్పందించి కోరుట్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. నామినేటెడ్ పదవుల్లో సీనియర్లకు ప్రాధాన్యం ఇచ్చి పార్టీని బలోపేతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎర్రోళ్ల హనుమండ్లు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ యామ రాజయ్య, సంతోష్ రెడ్డి, అందే మారుతి బాపూజీ, మరంపెల్లి శంకర్, తదితరులు పాల్గొన్నారు.

