
కోరుట్ల వైద్య సేవల బలోపేతానికి 19 వినతులు
కోరుట్ల వైద్య సేవల బలోపేతానికి 19 వినతులు
రాష్ట్రస్థాయి వైద్య–ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహకు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల వినతి
హైదరాబాద్ / కోరుట్ల, జూలై 28 ( ప్రజా కలం ): రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనర్సింహ అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్రస్థాయి వైద్య–ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గంలోని ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలోపేతం చేయడానికి సంబంధించిన 19 కీలక వినతిపత్రాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకంగా చర్చించారు.నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వైద్యులను బదిలీ చేయకుండా కొనసాగించాలని, ఇప్పటికే వైద్యుల కొరత కారణంగా ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఖాళీ పోస్టులను కొత్త నియామకాలతో భర్తీ చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. అలాగే కోరుట్ల ఏరియా ఆసుపత్రి, మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన అత్యాధునిక వైద్య పరికరాలను అత్యవసరంగా మంజూరు చేయాలని కోరారు. కోరుట్ల ఆసుపత్రికి ఈ ఎన్ టి, ఐసియు, ఎస్ఎన్సీయూ ఆపరేషన్ థియేటర్, ఆర్థోపెడిక్, సర్జికల్ పరికరాలు, మెట్పల్లి ఆసుపత్రికి ఓటి హైడ్రాలిక్ టేబుల్స్, ఓటి ల్యాంపులు, ఆక్సిజన్ జనరేటర్, 60 కెవి జనరేటర్ తదితర పరికరాలను అందించాలని విజ్ఞప్తి చేశారు. కోరుట్ల ఏరియా ఆసుపత్రి, మెట్పల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఖాళీగా ఉన్న వైద్యులు, స్పెషలిస్టులు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్, సాంకేతిక, పరిపాలనా సిబ్బంది పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కోరుట్ల ఆసుపత్రిలో పారిశుద్ధ్య సిబ్బందిని 34 నుంచి 55 మందికి, మెట్పల్లి ఆసుపత్రిలో 31 నుంచి 54 మందికి పెంచాలని ప్రతిపాదించారు. అదేవిధంగా కోరుట్ల 100 పడకల ఏరియా ఆసుపత్రికి అవసరమైన క్యాడర్ స్ట్రెంగ్త్ పెంచాలని, మెట్పల్లి 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 50 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసి అదనపు వైద్య, నర్సింగ్, పారామెడికల్ సిబ్బందిని మంజూరు చేయాలని కోరారు. కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి ప్రత్యేక అంబులెన్స్ మంజూరు చేయడం, నూతన ఆసుపత్రి భవనం ప్రారంభానికి ముందే సిబ్బంది, బెడ్లు, వైద్య పరికరాలు, ల్యాబ్ సౌకర్యాలు, మందులు, ఫర్నిచర్ వంటి అన్ని మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ పైప్‌లైన్, రెండు బోర్వెల్లు, నియోజకవర్గంలోని 17 ఆరోగ్య ఉపకేంద్ర భవనాల పూర్తి కోసం అదనపు నిధులు మంజూరు చేయాలని కోరారు. కోరుట్ల మండలం మాధాపూర్‌లో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఐలాపూర్ పీహెచ్‌సీపై అధిక భారం పడుతున్నందున మాధాపూర్‌లో కొత్త పీహెచ్సీ ఏర్పాటు చేస్తే గ్రామీణ ప్రజలు, గర్భిణులు, వృద్ధులు, చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ కోరుట్ల నియోజకవర్గానికి సంబంధించిన ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల తెలిపారు. సమావేశంలో రాష్ట్ర వైద్య–ఆరోగ్య శాఖ అధికారులు, జగిత్యాల జిల్లా వైద్య–ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

