
‘పెండింగ్ బిల్లుల పంచాయతీ’
మాజీ సర్పంచ్ లు … తాజా సర్పంచ్ లు… మధ్యలో పంచాయతీ కార్యదర్శులు…
– జిపిల్లో మొదలైన ‘పెండింగ్ బిల్లుల పంచాయతీ’
– విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధులు తమకే చెల్లించాలని మాజీ సర్పంచ్ల పట్టు
– తాము చేస్తున్న అభివృద్ధి పనులకి వాడుకుంటామంటున్న తాజా సర్పంచ్లు
– ప్రత్యేక అధికారుల పాలనలో తాము పెట్టిన బిల్లులను చెల్లించాలంటున్న పంచాయతీ కార్యదర్శిలు…
– ప్రభుత్వ ఆదేశాలను మాత్రమే పాటిస్తామంటున్న అధికారులు
ఫోటో : గ్రామపంచాయతీ భవనం.
ఎల్లారెడ్డి మార్చ్ 16 ప్రజా కలం ప్రతినిధి : రెండేళ్ల సుదీర్ఘకాలం తర్వాత విడుదలైన 15 వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలలో కొత్త చిచ్చును రేపాయి. ఇటీవల విడుదలైన ఈ నిధులను తమ పెండింగ్ బిల్లులకే కేటాయించాలని మాజీ సర్పంచ్లు కోరుతుండగా, ప్రస్తుతం చేపడుతున్న అభివృద్ధి పనులకు వాడుకుంటామని తాజా సర్పంచ్ లు పట్టు పడుతున్నారు. వీరి ఇరువురి మధ్యలో ప్రత్యేక అధికారుల పాలనలో తాము పెట్టిన ఖర్చులను బిల్లుల రూపంలో చెల్లించాలని పంచాయతీ కార్యదర్శులు సైతం డిమాండ్ చేస్తున్నారు. దీంతో వచ్చిన 15 వ ఆర్థిక సంఘం నిధులను ఎవరికి చెల్లిస్తారో చూడాలి. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను మాత్రమే తాము పాటిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
మాజీ సర్పంచ్లకు చెల్లించాల్సి ఉన్న పెండింగ్ బిల్లులు…
గత ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీలో అప్పటి సర్పంచులు అభివృద్ధి పనుల నిమిత్తం లక్షలాది రూపాయలు అప్పులు తెచ్చి మరీ పనులు చేశారు. అయితే ఆ బిల్లులు మంజూరు కాకముందే ప్రభుత్వం మారిపోయింది. దీనికి తోడు పంచాయతీ పాలకవర్గాల గడువు సైతం ముగిసింది. మాజీ సర్పంచులు తాము అభివృద్ధి పనుల నిమిత్తం చేపట్టిన పెండింగ్ బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారని వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. మండలం లోని ఆయా గ్రామ పంచాయతీలో ఒక్కో సర్పంచ్కు సుమారు 10 నుంచి 20 లక్షల వరకు పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో 15వ ఆర్థిక సంఘం నిధులలో తమకే ముందుగా ప్రాధాన్యమిచ్చి పెండింగ్ బిల్లులను చెల్లించాలని మాజీ సర్పంచ్లు వేడుకుంటున్నారు. ఇప్పటికే తాము తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఆస్తులు అమ్ముకుంటున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఆలస్యం చేస్తే తమకు ఆత్మహత్యలు తప్ప మరో మార్గం లేదని వారు దుఃఖంతో తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు.
పంచాయతీ కార్యదర్శులకు సైతం చెల్లించాల్సిన బిల్లులు ఎన్నో….
గత 2024 సంవత్సరం ఫిబ్రవరిలో అప్పటి పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసింది. తర్వాత జిపి లకు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఎన్నికలు నిర్వహించలేదు. నూతన పాలకవర్గాలు పంచాయతీల లో కొలువు దీరకపోవడంతో కేంద్ర ప్రభుత్వ నిధులు విడుదల కాలేదు. అప్పటి నుండి పంచాయతీల నిర్వహణ బాధ్యతను పూర్తిగా కార్యదర్శులే చూశారు. గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులు బాధ్యతలు నిర్వహించి నప్పటికీ ఆర్థికంగా మాత్రం వారు ఎలాంటి ఖర్చులు చేయలేదని తెలుస్తోంది. దీంతో చెత్త సేకరణ కోసం ట్రాక్టర్ డీజిల్, బ్లీచింగ్ పౌడర్, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు, వీధి దీపాల నిర్వహణ వంటి ఎన్నో పనులను పంచాయతీ కార్యదర్శులు సొంత డబ్బులు పెట్టి నిర్వహించారు. పంచాయతీల నిర్వహణతో పాటు సర్పంచ్ ఎన్నికల వరకు తామే అన్ని ఖర్చులు పెట్టామని పంచాయతీ కార్యదర్శులు తెలిపారు. ప్రస్తుతం ఒక్కొ పంచాయతీ కార్యదర్శి లక్ష రూపాయలు మొదలుకొని 5 లక్షల రూపాయల వరకు బిల్లులు రావాల్సి ఉందని వారు అంటున్నారు. తాము సైతం మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వారమేనని అప్పులు తెచ్చి మరీ పంచాయతీలను నిర్వహించామని, తమకే ముందుగా 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి తాము పెట్టిన ఖర్చుల బిల్లులు చెల్లించాలని వారు వేడుకుంటున్నారు.
నిధులు వచ్చిన ఎవరికి చెల్లించాలో తెలియక తికమక…
మొన్నటి వరకు నిధులు లేక ఇబ్బంది పడ్డ గ్రామ పంచాయతీలు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15 వ ఆర్థిక సంఘం నిధుల ను ఎవరికి చెల్లించాలో తెలియక సంబంధిత శాఖల అధికారులు తికమక పడుతున్నారు. అయితే విడుదలైన నిధులలో 10 లక్షల లోపు ఉన్న పెండింగ్ బిల్లులను మాజీ సర్పంచ్లకు చెల్లించాలని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ కమిషనర్ ఆదేశించినట్లు మాజీలు చెబుతున్నారు. మరోవైపు ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీ కార్యదర్శులు పెట్టిన ఖర్చులను మాత్రమే చెల్లించాలని ఉత్తర్వులు జారీ అయినట్లు సమాచారం. విడుదలైన కొద్దిపాటి నిధులను ఎవరికి చెల్లించాలో తెలియక పోవడంతో పాటు ప్రస్తుత తాజా సర్పంచ్లకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. గ్రామాల్లో ప్రస్తుతం చేపడుతున్న అత్యవసర అభివృద్ధి పనులకే తాము 15 ఆర్థిక సంఘం నిధులను వాడుకుంటామని వారు స్పష్టం చేస్తున్నారు.
తిరిగి గెలిచిన మాజీ లకు మాత్రం నో టెన్షన్….
అయితే గతంలో సర్పంచ్ గా పనిచేసి ఇటీవల జరిగిన ఎన్నికల్లో తిరిగి గెలిచిన సర్పంచ్లకు మాత్రం 15 ఆర్థిక సంఘం నిధుల చెల్లింపు విషయంలో ఎలాంటి గందరగోళం లేదు. గతంలో భర్త ఉండి ప్రస్తుతం సర్పంచ్ గా భార్య గెలిచిన కూడా అప్పుడు తాము పెట్టిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులను ఈ నిధులలో నుండి తీసుకునే వెసులుబాటు వారికి ఉంది. ఎందుకంటే సర్పంచ్ గా అధికారం తమ చేతుల్లోనే ఉండడంతో ఎలాంటి గందరగోళం లేదు.
కానీ గతంలో సర్పంచ్ గా పనిచేసి ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన, రిజర్వేషన్లు అనుకూలించక పోటీ చేయకుండా దూరంగా ఉన్న వారి గ్రామాల్లో మాత్రమే పెండింగ్ బిల్లుల చెల్లింపు సమస్య ప్రారంభమైంది. అటు మాజీ సర్పంచ్ లు ఇటు తాజా సర్పంచ్ లు మధ్యలో పంచాయతీ కార్యదర్శులు అన్నట్లుగా పరిస్థితి తయారయింది. మరి ఈ ముగ్గురిలో ఎవరికి పెండింగ్ బిల్లులు చెల్లిస్తారో వేచి చూడాలి..

