
ఉక్రెయిన్ నుంచి మృతదేహం తరలింపు
ఉక్రెయిన్ నుంచి మృతదేహం తరలింపు
ఖర్చు భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం
రూ.6 లక్షల ఆర్థిక సహాయం కోరుతూ సీఎంకు లేఖ రాసిన మంత్రి అడ్లూరి
సహాయం కోసం ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ని ఆశ్రయించిన మృతుని కుటుంబం
జగిత్యాల ప్రతినిధి అక్టోబర్ 11 (ప్రజాకలం)

ఉక్రెయిన్‌లో ఉద్యోగం చేస్తున్న జగిత్యాల జిల్లా, జగిత్యాల అర్బన్ మండలం, హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ సెప్టెంబర్ 1న రష్యా రాకెట్ దాడిలో మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు రూ.6 లక్షలు చెల్లించాలని ఇండియన్ ఎంబసీ సూచించడంతో, ఆర్థిక సహాయం కోసం మృతుడి భార్య వావిలాల భార్గవి, తల్లి గంగు శుక్రవారం హైదరాబాద్‌లోని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ని ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి వారికి అవసరమైన మార్గదర్శనం చేశారు.‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ని సందర్శించిన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతదేహం కోసం కుటుంబ సభ్యులు 39 రోజులుగా ఎదురు చూస్తుండటం పట్ల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) అధికారులతో మాట్లాడి, మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు రూ.6 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి అధికారికంగా లేఖ రాశారు.అదేవిధంగా, సీఎం ప్రజావాణి నోడల్ అధికారి కె. విద్యాసాగర్ ప్రత్యేక చొరవ తీసుకుని సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాస్‌తో మాట్లాడి బాధిత కుటుంబానికి సహాయం అందించే అంశంపై దృష్టి సారించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, హస్నాబాద్ మాజీ సర్పంచ్ బత్తుల గంగాధర్, తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ సభ్యులు చెన్నమనేని శ్రీనివాస రావు, స్వదేశ్ పరికిపండ్ల, నంగి దేవేందర్ రెడ్డి, వాలంటీర్లు గంగుల మురళీధర్ రెడ్డి, గాజుల సంపత్ కుమార్, మలేసియా ఎన్నారై గాజెంగి రంజిత్, సీఎం ప్రవాసీ ప్రజావాణి లైజన్ ఆఫీసర్ భార్గవి నద్దునూరి తదితరులు పాల్గొన్నారు.


