
దళిత గిరిజనుల విద్యపై ప్రభుత్వ నిర్లక్ష్యం
-కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కల్లెపల్లి అశోక్
*జిల్లా కలెక్టర్ ముందు కేవీపీఎస్ ధర్నా
పెద్దపల్లి, (ప్రజాకలం జిల్లా ప్రతినిధి)
దళిత,గిరిజనుల విద్య పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేవీపీఎస్ నాయకులు ఆరోపించారు.బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కేవీపీఎస్ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కల్లెపల్లి అశోక్ మాట్లాడుతూ గత మూడేళ్లుగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విద్యార్థులకు రావాల్సిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు.దీనివల్ల జిల్లాలోని పాఠశాలలు విద్యార్థులను చేర్చుకోవడానికి నిరాకరిస్తున్నాయని,ఫీజులు చెల్లించాలని, పుస్తకాలు,యూనిఫామ్ కొనుక్కోవాలని పాఠశాల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమస్యపై అధికారులు,రాష్ట్ర మంత్రులు,జిల్లా కలెక్టర్ ఎవరూ దృష్టి పెట్టడం లేదని,ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆయన తీవ్రంగా విమర్శించారు.దళిత,గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు తక్షణమే పెండింగ్ బిల్లులను విడుదల చేసి,ప్రతి విద్యార్థిని పాఠశాలలో చేర్పించి,వారికి అవసరమైన పుస్తకాలు,దుస్తులు అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అనంతరం కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మొదుంపల్లి శ్రావణ్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు సురేష్,లావణ్య,రమేష్,శ్రీనివాస్,రవి,సంతోష్, గీత,వినోద్ తదితరులు పాల్గొన్నారు.

