
ఏసీబీ కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ
ఏసీబీ కి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ
సీసీ రోడ్డు పనుల కోసం రూ.90 వేలు లంచం డిమాండ్
పెద్దపల్లి,జూలై 12:(ప్రజాకలం జిల్లా ప్రతినిధి)
పెద్దపల్లి జిల్లా,కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ జగదీష్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓదెల మండలం బాయిముపల్లికి చెందిన కాంట్రాక్టర్ కావేటి రాజు నుండి రూ.90 వేల లంచం తీసుకుంటుండగా ప్రధాన రహదారిపైనే ఈ సంఘటన జరిగింది.కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో రూ.15 లక్షల విలువైన సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు సంబంధించి ఏఈ జగదీష్ రూ.90 వేల లంచం డిమాండ్ చేసినట్లు కాంట్రాక్టర్ కావేటి రాజు తెలిపారు.జగదీష్ లంచం అడగటంతో,రాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.వారి సూచనల మేరకు,మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ముందున్న ప్రధాన రహదారిపైనే కాంట్రాక్టర్ రాజు నుండి లంచం తీసుకుంటున్న సమయంలో జగదీష్‌ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.ఈ ఘటనతో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఏ స్థాయిలో ఉందో మరోసారి బయటపడింది.ఏసీబీ అధికారులు జగదీష్‌ను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ జరుపుతున్నారు.

