
బీసీ బాలికల వసతి గృహంలో ఎనిమిదో తరగతి విద్యార్థిని మృతి
బీసీ బాలికల వసతి గృహంలో….
– ఎనిమిదో తరగతి విద్యార్థిని మృతి
– విద్యార్థిని మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోపణ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 15 ప్రజా కలం : ఎల్లారెడ్డి పట్టణంలోని బీసీ బాలికల వసతి గృహంలో ఎనిమిదో తరగతి విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానిక
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీసీ బాలికల వసతి గృహంలో నస్రుల్లాబాద్ మండలం హాజీపూర్ కు చెందిన రాపాని శ్రావణి (13) అనే విద్యార్థిని స్థానిక బీసీ బాలికల వసతి గృహం లో ఉంటూ ఎల్లారెడ్డి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. ఆమె బుధవారం తెల్లవారుజామున వసతి గృహం వరండాలో పడి మృతి చెందింది. శ్రావణి తెల్లవారుజామున వాష్ రూమ్ కోసం వెళ్లి వస్తుండగా వరండాలో పడి మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు.


వరండాలో విద్యార్థిని పడిపోవడాన్ని గమనించిన వసతి గృహం సిబ్బంది… చికిత్స నిమిత్తం ఆమెను హుటాహుటిన ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ శ్రావణిని పరిశీలించిన వైద్యులు అప్పటికే శ్రావణి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆర్డీవో ప్రభాకర్, బాన్సువాడ డిఎస్పి విట్టల్ రెడ్డి, తహశీల్దార్ ప్రేమ్ కుమార్ , సీఐ రాజిరెడ్డి, ఎస్సై మహేష్ ఆస్పత్రికి చేరుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం వసతిగృహానికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. నస్రుల్లాబాద్ మండలం హాజీపూర్నకు చెందిన శ్రావణి కి తండ్రి లేకపోవడంతో వసతి గృహంలో ఉండి నాలుగేళ్లుగా చదువుకుంటున్నట్లు విద్యార్థులు తెలిపారు. శ్రావణి తల్లి, అన్న, అక్క హైదరాబాద్ లో పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే శ్రావణి మృతి చెందడంతో హాస్టల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యార్థిని తనకు తానే పడి చనిపోయిందా.. లేక గుండెపోటుతో చనిపోయిందా?అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విషయమై అధికారులు వైద్యులతో విద్యార్థులతో చర్చిస్తున్నారు. అయితే వసతిగృహంలో నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థిని మృతి చెందిందని ఆరోపిస్తూ హాజీపూర్ గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. వారంతా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చార. సమగ్ర విచారణ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
పోలీస్ స్టేషన్కు భారీగా చేరుకుంటున్న బాధిత విద్యార్థిని బంధువులు, కుటుంబ సభ్యులు, ఆయా పార్టీల నేతలు….
వసతి గృహంలో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పట్ల ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, అధిక సంఖ్యలో ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్కు చేరుకుంటున్నారు. అలాగే ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు సైతం పోలీస్ స్టేషన్కు చేరుకుంటున్నారు. విద్యార్థిని కుటుంబానికి తగు న్యాయం చేయాలని లేని పక్షంలో ఆందోళన చేస్తామని వారు పేర్కొంటున్నారు. మరోవైపు పరిస్థితులు చేయి దాటి పోకుండా ఉండేందుకు పోలీసులు ముందు జాగ్రత్తగా అదనపు బలగాలను రప్పించి శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు.

