
ఉక్రెయిన్ నుంచి మృతదేహం
ఉక్రెయిన్ నుంచి మృతదేహం
రవాణాకు ప్రభుత్వం చొరవ
◉ ఫలించిన ఎమ్మెల్యే, మంత్రి ప్రత్యేక కృషి
◉ భూమార్గంలో ఉక్రెయిన్ నుంచి పోలాండ్‌కు
◉ ఈనెల 31న స్వగ్రామం చేరనున్న శవపేటిక
జగిత్యాల ప్రతినిధి అక్టోబర్ 25 (ప్రజా కలం)
జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ మృతదేహాన్ని ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకున్నది. ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ బృందం, ప్రభుత్వ ఉన్నతాధికారులు, భారత రాయబార కార్యాలయం సమన్వయంతో మృతదేహం తరలింపునకు చర్యలు చేపట్టారు.ఉక్రెయిన్‌లో కాంక్రీట్ కార్మికుడిగా పనిచేస్తున్న సుదర్శన్ సెప్టెంబర్ 1న రష్యా క్షిపణి దాడిలో మరణించారు. దాదాపు రెండు నెలల అనంతరం ఆయన మృతదేహం స్వదేశానికి చేరుకోనున్నది. క్షిపణి దాడి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో మృతదేహాన్ని తరలించేందుకు అనుమతి లభించడంలో జాప్యం జరిగినట్లు తెలుస్తున్నది. ఉక్రెయిన్ నుంచి మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించాలని మృతుడి భార్య భార్గవి ఇటీవల హైదరాబాద్‌లోని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’లో విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో… ఈమేరకు ప్రభుత్వం వేగంగా స్పందించిందని తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి తెలిపారు.జగిత్యాల ఎమ్మెల్యే డా. మాకునూరి సంజయ్ కుమార్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక విజ్ఞప్తుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై చొరవ తీసుకున్నది. మృతదేహం తరలింపునకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని కోరింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ–పొలిటికల్) ముఖ్య కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి అహ్మద్ నదీం ఈనెల 24న ఉక్రెయిన్‌లోని భారత రాయబారి అంజనీ కుమార్‌కు అత్యవసర సందేశం పంపారు.
భూమార్గంలో ఉక్రెయిన్ నుంచి పోలాండ్‌కు..
ఉక్రెయిన్ గగనతలంలో విమానాల రాకపోకలపై ఆంక్షలు ఉన్నందున, మృతదేహం ఉన్న శవపేటికను ఉక్రెయిన్ నుంచి పోలాండ్‌కు రోడ్డు మార్గంలో తరలించనున్నారు. అనంతరం కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్ విమానం ద్వారా పోలాండ్లోని వార్సా నుంచి నెదర్లాండ్స్‌లోని ఆమ్స్టర్డామ్కు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. విమాన ప్రయాణం ఈనెల 29న ప్రారంభం కానుండగా, మృతదేహం అక్టోబర్ 31 తెల్లవారుజామున హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నట్లు సమాచారం. అక్కడి నుంచి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు.

