
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి
ప్రభుత్వంతో తక్షణమే చర్చలు జరపాలి.. రైస్ మిల్లర్ల మహాధర్నా
వరంగల్ (ప్రజా కలం ): రైస్ మిల్లర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ, వరంగల్ జిల్లాల రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏకశిలా పార్కు ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మిల్లర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ డిమాండ్లను వినిపిస్తూ.. వెంటనే అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు.
మిల్లర్లపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గత రెండు నెలల్లో రన్నింగ్ మిల్లర్లపై నమోదైన కేసులను భేషరతుగా ఉపసంహరించుకోవాలని కోరారు. ఇరుపక్షాలకు ఆమోదయోగ్యంగా CMR అగ్రిమెంట్‌ను రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. OTR, టెస్ట్ మిల్లింగ్ లేదా కర్ణాటక శాస్త్రవేత్తల నివేదిక ఆధారంగానే బియ్యాన్ని స్వీకరించాలని కోరారు.
మిల్లింగ్ ఛార్జీలు పెంచాలి
క్వింటాల్ ధాన్యానికి మిల్లింగ్ ఛార్జీని రా రైస్‌కు రూ.150, బాయిల్డ్ రైస్‌కు రూ.200కు పెంచాలని మిల్లర్లు డిమాండ్ చేశారు. పాత గన్నీ బ్యాగు ధరను రూ.9గా నిర్ణయించి, పాత సంచులపై 20 శాతం తరుగుదలను తగ్గించాలని కోరారు. 2014 నుంచి పెండింగ్‌లో ఉన్న సివిల్ సప్లయిస్ మిల్లింగ్, రవాణా, డైయేజ్, కస్టోడియన్ ఛార్జీలను వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
పెనాల్టీ, వడ్డీపై అభ్యంతరం
డిఫాల్ట్ మిల్లర్లపై విధిస్తున్న 25 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డీకి సంబంధించిన జీవోను రద్దు చేయాలని కోరారు. 2022–23 రబీ టెండర్ ధాన్యం ధరను న్యాయంగా నిర్ణయించి, అప్పటి గోదాం, హమాలీ, హ్యాండ్లింగ్ ఛార్జీలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాల కారణంగా నష్టపోయి డిఫాల్ట్ అయిన మిల్లర్ల ఖాతాలను పూర్తిగా పరిష్కరించి, బకాయిలను నాలుగు విడతల్లో అప్పటి ధాన్యం కనీస మద్దతు ధర (MSP) ప్రకారం చెల్లించే అవకాశం కల్పించాలని కోరారు.
CMR ధాన్యం పూర్తిగా తీసుకున్న తర్వాతే కొత్త కేటాయింపులు
ఖరీఫ్ ధాన్యాన్ని సివిల్ సప్లయిస్ ద్వారా రా రైస్‌గా, రబీ ధాన్యాన్ని పూర్తిగా FCI ద్వారా బాయిల్డ్ రైస్‌గా స్వీకరించాలని మిల్లర్లు కోరారు. FCI కఠిన నిబంధనలను కొంతమేర సడలించి లెవీకి సరిపడా గోదాం స్థలాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మిల్లర్ల వద్ద ఉన్న మొత్తం CMR ధాన్యాన్ని త్వరగా బియ్యంగా తీసుకున్న తర్వాతే ఖరీఫ్ 2026–27 సీజన్ ధాన్యాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం తమ సమస్యలను సానుకూలంగా పరిశీలించి, తక్షణమే అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నాయకులు కోరారు. ధర్నాలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

