
చేతల్లో ప్రజా రంజక పాలన.. మాటల్లో హరీష్ అబద్ధాల పురాణం
చేతల్లో ప్రజా రంజక పాలన.. మాటల్లో హరీష్ అబద్ధాల పురాణం
-ప్రభుత్వ విప్,పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు
పెద్దపల్లి,జూన్ 08:(ప్రజాకలం జిల్లాప్రతినిధి)
మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ కీలక నేత తన్నీరు హరీష్ రావు ఒక పచ్చి అబద్ధాలకోరని,పదేళ్లపాటు అనుభవించిన అధికారం ఒక్కసారిగా చేజారిపోవడంతో వచ్చిన తీవ్ర నిరాశల్లోనే ఆయన మతిభ్రమించి కాంగ్రెస్ ప్రభుత్వంపై లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వ విప్,పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ గత పాలనపై,ఆ పార్టీ నాయకుల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని,ఆరు గ్యారంటీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎంతో నిబద్ధతతో అమలు చేస్తూ ప్రజా రంజక పాలన అందిస్తుంటే, దానిని ఓర్వలేకనే ప్రతిపక్ష నాయకులు నిరాధార వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.పదేళ్ల బీఆర్ఎస్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడి, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలంగాణను,ఇక్కడి ప్రజల సంతోషాన్ని చూసి హరీష్ రావుకు నిద్రపట్టడం లేదని,అందుకే నిత్యం పత్రికల్లో,టీవీల్లో హెడ్‌లైన్స్‌లో నిలవడానికే అడ్డగోలు రాతలు రాస్తూ,కూతలు కూస్తున్నారని దుయ్యబట్టారు.రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందన్న విజయ రమణారావు,అందులో భాగంగానే రైతు డిస్కంలతో సోలార్ పంపు సెట్లను పెద్ద ఎత్తున ప్రోత్సహించి వ్యవసాయ రంగానికి పగటిపూటే నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు విద్యుత్ ఆదా చేయడానికి ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు.ఈ సరికొత్త సోలార్ విధానం ద్వారా రైతులకు పెట్టుబడి భారం తగ్గడమే కాకుండా,రాష్ట్రంలో భవిష్యత్తు విద్యుత్ అవసరాలను తీర్చవచ్చని వివరించారు. రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, ఒకవేళ రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వకపోతే రాబోయే ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని తాము బహిరంగంగా సవాల్ విసిరితే, ఆ సవాల్‌ను స్వీకరించే దమ్ము లేక హరీష్ రావు కానీ,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కానీ ఎందుకు నోరు మెదపడం లేదని,వారి వద్ద సమాధానం ఉంటే ప్రజల ముందుకు వచ్చి చెప్పాలని ఈ సందర్భంగా ఆయన నిలదీశారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన చారిత్రాత్మక అవినీతిపై విజయ రమణారావు మాట్లాడుతూ రీడిజైనింగ్ పేరుతో ప్రాజెక్టు వ్యయాన్ని వేల కోట్లకు పెంచేసి,మేడిగడ్డ బారేజ్ కుంగిపోయేలా దారుణమైన నాణ్యతా లోపాలకు కారణమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాళేశ్వరం పేరుతో ఏకంగా లక్ష కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచుకున్న మామా అల్లుళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి,రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడే కనీస నైతిక హక్కు లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టి,రాష్ట్రాన్ని దివాళా తీయించిన బీఆర్ఎస్ నేతలు ఈరోజు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.ఇకనైనా హరీష్ రావు తన పద్ధతి మార్చుకుని అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోవాలని, మరోసారి ప్రభుత్వంపై,ముఖ్యమంత్రిపై ఇలాంటి అసత్యాలు మాట్లాడితే ఊరుకునేది లేదని,ప్రజలను సమీకరించి తగిన బుద్ధి చెబుతామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.ఈ మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య,పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గొపగాని సారయ్య గౌడ్,ప్రజాప్రతినిధులు,జెడ్పీటీసీలు,ఎంపీపీలు,వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు,అనుబంధ సంఘాల ప్రతినిధులు,కార్యకర్తలు, పాల్గొన్నారు.

