
ప్రయాణికుల సురక్షిత ప్రయాణమే డ్రైవర్ల ప్రధాన లక్ష్యం
ప్రయాణికుల సురక్షిత ప్రయాణమే డ్రైవర్ల ప్రధాన లక్ష్యం
అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలి
: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల ప్రతినిధి సెప్టెంబర్ 9(ప్రజా కలం)
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే ఆర్టీసీ డ్రైవర్ల ప్రధాన లక్ష్యంగా ఉండాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ సూచించారు. జగిత్యాల ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, ప్రమాదాల నివారణపై నిర్వహించిన డ్రైవర్ల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని, వారి ప్రాణాల భద్రత డ్రైవర్ల బాధ్యతపై ఆధారపడి ఉంటుందని అన్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా భారీ ప్రమాదానికి దారితీసే అవకాశం ఉన్నందున ప్రతి డ్రైవర్ రహదారి భద్రతను వ్యక్తిగత బాధ్యతగా భావించి విధులు నిర్వహించాలని సూచించారు.
అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, ప్రమాదకర ఓవర్‌టేకింగ్‌కు దూరంగా ఉండాలని, మలుపులు, కూడళ్లు, వంతెనలు, రద్దీ ప్రాంతాలు, పాఠశాలలు, మార్కెట్ల వద్ద వేగాన్ని నియంత్రించాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగించడం పూర్తిగా నివారించాలని స్పష్టం చేశారు.ఇతర వాహనదారులు చేసే తప్పులను ముందుగానే అంచనా వేసి అవసరమైన సమయంలో వేగాన్ని తగ్గించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని, ప్రతి డ్రైవర్ డిఫెన్సివ్ డ్రైవింగ్‌ను అలవర్చుకోవాలని ఎస్పీ సూచించారు. ఆర్టీసీ డ్రైవర్లు క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌కు ఆదర్శంగా నిలవాలని అన్నారు.

ఉత్తమ డ్రైవర్లకు సన్మానం
ఉద్యోగ నిర్వహణలో ఎలాంటి రోడ్డు ప్రమాదాలకు తావులేకుండా సురక్షితంగా విధులు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలిచిన ముగ్గురు ఉత్తమ ఆర్టీసీ డ్రైవర్లను ఎస్పీ అశోక్ కుమార్ శాలువాలతో సన్మానించి అభినందించారు. ఇతర డ్రైవర్లు కూడా వారిని ఆదర్శంగా తీసుకుని ప్రమాదరహిత డ్రైవింగ్‌కు కట్టుబడి విధులు నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, డీటీఓ మహమ్మద్ సందాని, ఆర్టీసీ ఆర్‌ఎం రాజు, డిప్యూటీ ఆర్‌ఎం భూపతి రెడ్డి, టౌన్ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్, డిపో మేనేజర్లు రమేశ్, మనోహర్, హరి, ట్రాఫిక్ ఎస్‌ఐ మల్లేశ్, అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాస్‌తో పాటు ఆర్టీసీ డ్రైవర్లు పాల్గొన్నారు.

