
ప్రెస్ క్లబ్స్ జాతీయ సదస్సుకు గవర్నర్‌కు ఆహ్వానం
ప్రెస్ క్లబ్స్ జాతీయ సదస్సుకు గవర్నర్‌కు ఆహ్వానం
హైదరాబాద్, ఆగస్టు 18 (ప్రజాకలం న్యూస్): ప్రెస్ క్లబ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఈ నెల 21న నిర్వహించనున్న జాతీయ సదస్సు ప్రారంభ ఆహ్వాన విందుకు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు ఆయన తన అంగీకారం తెలిపారు.
మంగళవారం లోకభవన్‌లో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రమేష్ వరికుప్పల నేతృత్వంలోని ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలిసి సదస్సుకు ఆహ్వానించింది. జాతీయ స్థాయిలో మీడియా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, మారుతున్న మీడియా పోకడలు, జర్నలిస్టుల పనితీరుపై గవర్నర్ సదస్సులో సందేశం ఇవ్వనున్నారు.
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు ఏ. రాజేష్, జాయింట్ సెక్రటరీలు చిలుకూరి హరిప్రసాద్, వర్ధిల్లి బాపూరావు, కోశాధికారి రమేష్ వైట్ల, కార్యవర్గ సభ్యుడు ఎన్. శ్రీనివాస్ రెడ్డి తదితరులు గవర్నర్‌ను కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు.
గవర్నర్‌కు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ డైరీని పాలక మండలి అందజేసింది. అనంతరం పూల మొక్కను అందించి సత్కరించారు.
తాజ్ కృష్ణ హోటల్‌లో సదస్సు
హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో ఈ నెల 21న ప్రారంభమయ్యే ప్రెస్ క్లబ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ సదస్సు రెండు రోజులపాటు కొనసాగనుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పలువురు సీనియర్ జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు సదస్సుకు హాజరుకానున్నారు. మీడియా రంగంలోని తాజా పరిణామాలు, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్ సవాళ్లపై సదస్సులో చర్చించనున్నారు.

