
దసరా వేడుకలకు పటిష్ట పోలీస్ బందోబస్తు
దసరా వేడుకలకు పటిష్ట పోలీస్ బందోబస్తు
భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల ప్రతినిధి అక్టోబర్ 20 (ప్రజా కలం)
దసరా వేడుకలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగేలా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల పట్టణాల్లో దసరా వేడుకలు నిర్వహించే ప్రాంతాలను ఆయన సంబంధిత పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించి, భద్రతా ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా ప్రజలందరూ దసరా పండుగను ప్రశాంతమైన, సురక్షిత వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకునేలా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించాలని అధికారులను ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీస్ అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని,అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పండుగ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు పాల్పడవద్దని ప్రజలకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం కోసం డయల్ 112కు ఫోన్ చేయాలని కోరారు. ఈ పరిశీలనలో డీఎస్పీలు పురుషోత్తం రెడ్డి, రాములు, సంబంధిత పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు.

