
విద్యార్థుల భద్రతే లక్ష్యం.. గజ్వేల్‌లో స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు
విద్యార్థుల భద్రతే లక్ష్యం.. గజ్వేల్‌లో స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు
గజ్వేల్:19 జూన్ 2026 ( ప్రజా కలం ప్రతినిధి)
పోలీస్ కమిషనర్ (సీపీ) ఆదేశాల మేరకు గజ్వేల్ పట్టణంలోని పిడిచేడు రోడ్డుపై శుక్రవారం పాఠశాల బస్సులపై గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు పాఠశాల బస్సుల భద్రతా ప్రమాణాలు, వాహనాలకు సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
తనిఖీల సందర్భంగా పాఠశాల యాజమాన్యాలు, డ్రైవర్లు, సహాయక సిబ్బందికి విద్యార్థుల భద్రతకు సంబంధించిన పలు సూచనలు చేశారు. బస్సు డ్రైవర్లు పరిశుభ్రమైన యూనిఫాం ధరించి నేమ్ బ్యాడ్జ్‌తో విధులు నిర్వహించాలని సూచించారు. అలాగే వాహనాలకు చెల్లుబాటు అయ్యే ఫిట్‌నెస్ సర్టిఫికెట్, పర్మిట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) ధ్రువపత్రాలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు.ప్రతి బస్సులో ఫస్ట్ ఎయిడ్ కిట్, జీపీఎస్ పరికరం, ఒక హెల్పర్ అందుబాటులో ఉండాలని సూచించారు. సీటింగ్ సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించరాదని, ఎమర్జెన్సీ ఎగ్జిట్ సక్రమంగా పనిచేస్తుందో లేదో కూడా తనిఖీ చేశారు.విద్యార్థుల భద్రత దృష్ట్యా అన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పాఠశాల యాజమాన్యాలకు సూచించారు. విద్యార్థుల సురక్షిత ప్రయాణం కోసం పాఠశాల బస్సులు నిర్దేశించిన అన్ని భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా అమలు చేయాలని గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ కోరారు..

