
మెట్‌పల్లి సీడీపీఓ ఏసీబీ వలలో
మెట్‌పల్లి సీడీపీఓ ఏసీబీ వలలో
మెట్‌పల్లి:(కోరుట్ల) ప్రతినిధి సెప్టెంబర్ 26(ప్రజా కలం): జగిత్యాల జిల్లా మెట్‌పల్లి సీడీపీఓ దరోజు పద్మ రూ.63 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ కరీంనగర్ యూనిట్‌కు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
మెట్‌పల్లి అర్బన్ సెక్టార్ పరిధిలోని 21 అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసే సమయంలో ప్రతికూల వ్యాఖ్యలు నమోదు చేయకుండా అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఒక్కో అంగన్‌వాడీ కేంద్రం నుంచి నెలకు రూ.1,000 చొప్పున, మూడు నెలలకు రూ.3,000 చొప్పున 21 కేంద్రాలకు కలిపి రూ.63,000 డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు.ట్రాప్‌లో భాగంగా ఫిర్యాదుదారుడి నుంచి రూ.63,000 లంచం మొత్తాన్ని అధికారిణి నేరుగా స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితురాలిని అరెస్టు చేసి కరీంనగర్‌లోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు జ్యుడిషియల్ రిమాండ్ కోసం హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ వెల్లడించింది.
లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫిర్యాదు
ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. ఏసీబీ వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ పేర్కొంది.

