జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు.

జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు.

*జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు..*
*అవినీతి ఆరోపణలపై అకస్మాత్తు తనిఖీలు – సిబ్బంది ఫోన్లు స్వాధీనం..*

జగిత్యాల్ ప్రతినిధి ఏప్రిల్ 07 (ప్రజాకలం)

జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఉదయం ఏసీబీ అధికారులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. పలు విభాగాల్లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంపై వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.దాడుల సందర్భంగా కార్యాలయంలో ఉన్న సిబ్బంది ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి సమాచారాన్ని బయటకు పంపకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కార్యాలయంలోని పత్రాలు, ఫైళ్లను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.
పట్టణంలో అనుమతుల మంజూరు, నిర్మాణాల అనుమతుల్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై ఏసీబీకి ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న అధికారుల పనితీరును సమగ్రంగా పరిశీలించారు.ఈ దాడులతో మున్సిపల్ కార్యాలయ సిబ్బందిలో కలకలం  రేగింది.పట్టణ ప్రజలు మాత్రం ఈ చర్యలను స్వాగతిస్తూ, అవినీతి నిర్మూలనకు ఇది మొదటి అడుగు కావాలని అభిప్రాయపడుతున్నారు.

*మున్సిపాలిటీలో నిర్వాహక లోపాలు బహిర్గతం…*

మున్సిపల్ పరిపాలనలో వ్యవస్థాగత లోపాలు, ఆదాయ వనరుల నిర్లక్ష్యం వెలుగులోకి వస్తున్నాయి. మంగళవారం ఏసీబీ నిర్వహించిన విస్తృత తనిఖీలు కేవలం అవకతవకలకే కాకుండా, మున్సిపాలిటీ పనితీరులో ఉన్న బలహీనతలను కూడా స్పష్టంగా బయటపెట్టాయి. పది గంటలపాటు సాగిన ఈ తనిఖీల్లో రికార్డుల నిర్వహణ నుంచి ఆదాయ సేకరణ వరకు అనేక కీలక అంశాల్లో లోపాలు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.


ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన రూ.14 కోట్ల ప్రాపర్టీ టాక్స్ లక్ష్యానికి కేవలం సగం వసూళ్లు మాత్రమే జరగడం ఆదాయ నిర్వహణలో వైఫల్యాన్ని సూచిస్తోంది. కమర్షియల్, యాడ్వర్టైజ్‌మెంట్ టాక్స్‌ల వసూళ్లు పూర్తిగా తగ్గిపోవడం, గతంలో వచ్చిన ఆదాయం ఈ ఏడాది కనిపించకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. ఇదే సమయంలో మున్సిపల్ ఆస్తుల పర్యవేక్షణలోనూ నిర్లక్ష్యం బయటపడింది. నాలుగు ఆటోలు, ఒక ట్రాక్టర్ గల్లంతైనా ఇప్పటివరకు చర్యలు లేకపోవడం గమనార్హం.
అద్దె భవనాలకు దాదాపు 18 ఏళ్లుగా రీ-టెండరింగ్ జరగకపోవడం, వాహనాల రిపేర్, డీజిల్ ఖర్చుల లెక్కల్లో స్పష్టత లేకపోవడం పరిపాలనలో పారదర్శకత లోపాన్ని చూపిస్తోంది. ఎల్ఆర్ఎస్, బిల్డింగ్ పర్మిషన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడం ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఫాగింగ్, సానిటేషన్ పనులకు సంబంధించిన రికార్డులు సరిగా నిర్వహించకపోవడం, కొనుగోళ్లకు జీఎస్టీ బిల్లులు లేకపోవడం ఆర్థిక క్రమశిక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.అత్యంత కీలకంగా, కొందరు అధికారుల యూపీఐ లావాదేవీలపై ఏసీబీ దృష్టి సారించడం, అధికార వ్యవహారాల్లో వ్యక్తిగత ఆర్థిక లావాదేవీల పాత్రపై అనుమానాలు పెంచుతోంది. బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయకపోవడం కూడా అధికారుల హాజరు, పనితీరుపై సందేహాలు రేకెత్తిస్తోంది.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )