
బీసీలు బానిసలు కాదు.. బాదుషాలు కావాలి
బీసీలు బానిసలు కాదు.. బాదుషాలు కావాలి
-బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
జిల్లాలో బీసీ భవనం కోసం కృషి
-బీసీ జేఏసీ జిల్లా చైర్పర్సన్ దాసరి ఉష

పెద్దపల్లి,జూన్ 29:(ప్రజాకలం జిల్లా ప్రతినిధి)
దశాబ్దాల రాజకీయ బానిసత్వానికి చరమగీతం పాడి,బీసీలు బానిసలుగా కాకుండా బాదుషాలుగా ఎదగాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్లో బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్ అధ్యక్షతన నిర్వహించిన బీసీల ఆత్మీయ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్,బీసీ జేఏసీ జిల్లా చైర్పర్సన్ దాసరి ఉష ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దశాబ్దాల రాజకీయ బానిసత్వానికి చరమగీతం పాడాలని బీసీ సమాజానికి పిలుపునిచ్చారు.రాష్ట్ర జనాభాలో 60 శాతానికి పైగా ఉండి,136 కులాల మద్దతు కలిగిన బీసీలు బలహీన వర్గాలు కాదని,వారు ఈ సమాజానికి వెన్నెముక వంటి బలమైన శక్తి అని చెప్పారు.రాబోయే 2028 ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో 60 మంది బీసీ అభ్యర్థులను గెలిపించుకుని అసెంబ్లీకి పంపడమే బీసీ ఉద్యమ ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.ఓటు అనే పదునైన ఆయుధాన్ని ఉపయోగించి అగ్రకులాల ఆధిపత్యాన్ని ఓడించాలని,తద్వారా రాష్ట్ర పాలనలో బీసీల ముద్ర ఉండాలని పిలుపునిచ్చారు. బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని హామీలిచ్చిన రాజకీయ పార్టీలు ఆ మాట నిలబెట్టుకోలేదని,కేవలం ఓట్ల కోసమే బీసీలను వాడుకుంటున్నాయని మండిపడ్డారు.బీసీలు పాలితులుగా మిగిలిపోవద్దని,పాలకులై తెలంగాణను శాసించాలని శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు సమావేశంలో ఉన్న బీసీ ప్రతినిధులలో సరికొత్త ఉత్తేజాన్ని,పోరాట పటిమను నింపాయి.ఇకనుండి అగ్రకులాలకు ఓటు వేయడాన్ని నిరాకరించాలని,కులాల వారీగా చీలిపోకుండా,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీలతో కలిసి బీసీలు ఐక్యంగా పోరాడితేనే సర్దార్ సర్వాయి పాపన్న ఆశించిన సమసమాజం సాధ్యమవుతుందని జాజుల శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.పెద్దపల్లి జిల్లాలో ఉన్న వివిధ కుల సంఘాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు,బీసీల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక బీసీ భవనం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని బీసీ జేఏసీ జిల్లా చైర్పర్సన్ దాసరి ఉష స్పష్టం చేశారు.స్థానికంగా నిర్వహించిన బీసీ నాయకుల సమావేశంలో ఆమె ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడుతూ జిల్లాలో బీసీ భవన నిర్మాణ ఆవశ్యకతపై ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర మంత్రులతో చర్చిస్తామని,ఈ భవన నిర్మాణానికి గట్టి ప్రయత్నం చేస్తామని ఆమె పేర్కొన్నారు.రాబోయే రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నామని, అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలలో తమ బలాన్ని నిరూపించుకుంటామని ఉష ధీమా వ్యక్తం చేశారు.భవిష్యత్తులో గ్రామ మరియు వార్డు స్థాయి వరకు బలమైన కమిటీలను ఏర్పాటు చేసి,బీసీ వాదాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లేలా ఉద్యమిస్తామని ఆమె పిలుపునిచ్చారు.ఈ ఆత్మీయ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం పెద్దల్లి జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్,బీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్,బీసీ విద్యార్థి జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్,మాజీ జెడ్పిటిసి గంట రాములు యాదవ్,మాజీ ఫిషరీస్ చైర్మన్ చేతి ధర్మయ్య,బీసీ జేఏసీ జిల్లా వైస్ చైర్మన్ కొండ సతీష్,మహిళా కన్వీనర్ సిరవేణి స్వప్న,జిల్లా మహిళా అధ్యక్షురాలు మండే లక్ష్మి, నాగమణి,జిల్లా ఉపాధ్యక్షులు బొడ్డుపల్లి లక్ష్మణ్,సుల్తానాబాద్ మండల అధ్యక్షుడు ఆసరి రాజయ్య,పెద్దపల్లి మండల అధ్యక్షుడు కలవేన రవి,ధర్మారం అధ్యక్షుడు చాగంటి కొండయ్య తోపాటు రమేష్,లక్ష్మణ్,బుగ్గ రామస్వామి,కాల్వ రమేష్,పోల్దాసరి సాయికుమార్,సదానందం,అబ్దుల్ మాలిక్,రవీందర్,బీరం రవి,అశోక్,రమేష్, కన్నం శ్రావణ్,అరవింద్,తదితర నాయకులకు పాల్గొన్నారు.

