
ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి
ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి
-6 నెలల పసికందుతో సహా 20 మందికి గాయాలు
పెద్దపల్లి,జూలై 01:(ప్రజాకలం జిల్లాప్రతినిధి)
పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.దర్శనం కోసం వచ్చిన భక్తులపై ఒక్కసారిగా తేనెటీగల గుంపు విరుచుకుపడటంతో ఆలయ ప్రాంగణం క్షణాల్లోనే భయానకంగా మారింది.ఎటు చూసినా భక్తుల అరుపులు,పరుగులతో ఆలయ పరిసరాలు గందరగోళంగా మారాయి.కరీంనగర్ నుంచి కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో పాటు అక్కడే ఉన్న పలువురిపై తేనెటీగలు ఒకేసారి దాడి చేశాయి.ఈ ఘటనలో ఆరు నెలల పసికందుతో సహా సుమారు 20 మంది వరకు గాయపడినట్లు సమాచారం.చిన్నారిపై కూడా తేనెటీగలు దాడి చేయడం అక్కడున్న వారిని తీవ్ర ఆందోళనకు గురిచేసింది.సమాచారం అందుకున్న108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి నరేష్, పైలట్ రాజేందర్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించి,క్షతగాత్రులను కాల్వ శ్రీరాంపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు బాధితులకు చికిత్స అందిస్తున్నారు.తేనెటీగల దాడికి కారణాలపై ఆలయ అధికారులు ఆరా తీస్తున్నారు.ఈ ఘటనతో దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.ఆలయ పరిసరాల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని భక్తులు అధికారులను కోరుతున్నారు.

