47 కేసుల్లో సీజ్ చేసిన రూ.9.50 లక్షల గంజాయి దహనం

47 కేసుల్లో సీజ్ చేసిన రూ.9.50 లక్షల గంజాయి దహనం

47 కేసుల్లో సీజ్ చేసిన రూ.9.50 లక్షల గంజాయి దహనం

గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తప్పవు

– జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

 

జగిత్యాల ప్రతినిధి నవంబర్ 13 (ప్రజా కలం)

గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై జగిత్యాల జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో నమోదైన 47 కేసులకు సంబంధించి నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సుమారు 19 కిలోల గంజాయిని అధికారులు శుక్రవారం దహనం చేశారు. దీని విలువ సుమారు రూ.9.50 లక్షలు ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ తెలిపారు.
జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఇన్సినరేషన్ ప్రక్రియ ద్వారా ఈ గంజాయిని దహనం చేశారు. ఎన్‌డీపీఎస్ చట్టంలోని నిబంధనలతో పాటు పర్యావరణ కాలుష్య నియంత్రణ మార్గదర్శకాలను పాటిస్తూ గంజాయి నిర్మూలన చేపట్టినట్లు ఎస్పీ వెల్లడించారు.
జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్‌గా ఎస్పీ అశోక్ కుమార్ వ్యవహరించగా, కమిటీ సభ్యులుగా అదనపు ఎస్పీ చేతన్ నితిన్, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్, వేణు పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు పురుషోత్తం రెడ్డి, రాములు, రవికుమార్‌తో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

యువతను మత్తు బారిన పడకుండా కాపాడాలి

ఈ సందర్భంగా ఎస్పీ అశోక్

కుమార్ మాట్లాడుతూ అక్రమ సంపాదనే లక్ష్యంగా కొందరు గంజాయి సాగు, విక్రయాలు, రవాణాకు పాల్పడుతూ యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తును నాశనం చేసే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎవరైనా గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలను అక్రమంగా రవాణా చేసినా, విక్రయించినా, నిబంధనలకు విరుద్ధంగా కలిగి ఉన్నా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసులకు ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )