ముఖ్యమంత్రికి మల్లన్న సాగర్ నిర్వాసితుల బహిరంగ లేఖ

ముఖ్యమంత్రికి మల్లన్న సాగర్ నిర్వాసితుల బహిరంగ లేఖ

ముఖ్యమంత్రికి మల్లన్న సాగర్ నిర్వాసితుల బహిరంగ లేఖ

 

•సిద్దిపేట సభలో సమస్యల పరిష్కారంపై స్పందించాలి

 

•పెండింగ్ పరిహారాలు, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలు వెంటనే అందించాలి

 

•సమస్యలు పరిష్కరించకుంటే మరో పోరాటానికి శ్రీకారం చుడతాం

 

గజ్వేల్, నవంబర్ 15 (ప్రజా కలం ప్రతినిధి):

 

మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నిర్వాసితులు బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆదివారం గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వాసితుల సమక్షంలో నిర్వహించిన సమావేశంలో బాధితుడు బండ్ల స్వామి బహిరంగ లేఖలోని అంశాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్లన్న సాగర్ నిర్వాసితులకు పెండింగ్‌లో ఉన్న పరిహారాలు, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలను వెంటనే మంజూరు చేసి అందించాలని డిమాండ్ చేశారు.అర్హులైన వారికి ఇళ్లు, ఇంటి స్థలాలు కేటాయించి రిజిస్ట్రేషన్‌తో పాటు పట్టాలు పంపిణీ చేయాలని కోరారు. పునరావాస కాలనీల్లో తాగునీరు, డ్రైనేజీ, రహదారులు వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని, అన్ని వర్గాలకు అనువుగా స్మశానవాటికలు నిర్మించాలని, పాఠశాలలు, దేవాలయాల నిర్మాణాలు వెంటనే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.అలాగే నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి వడ్డీలేని రుణాలు అందించాలని కోరారు. ఆర్‌అండ్‌ఆర్ కాలనీల్లో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయడంతో పాటు, కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు, మున్సిపల్ పన్నుల నుంచి పదేళ్లపాటు మినహాయింపు ఇస్తూ వెంటనే జీవో జారీ చేయాలని బహిరంగ లేఖలో పేర్కొన్నారు.మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల పోరాట సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏటిగడ్డ కిష్టాపూర్‌లో రెండు రోజుల పాటు దీక్ష చేపట్టి ముంపు గ్రామాల ప్రజలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన నిర్వాసితుల సమస్యలను విస్మరించడం సమంజసం కాదన్నారు.భూసేకరణ సమయంలో సరైన సర్వే నిర్వహించకపోవడం వల్ల అనేకమంది పరిహారాలకు దూరమయ్యారని, ఇళ్ల పరిహారాలు, ఇంటి ఆవరణ స్థలాల పరిహారాలు, ఇతర అర్హతలకు సంబంధించిన వివరాలను అధికారులు సక్రమంగా సేకరించకపోవడంతో ఇప్పటికీ బాధితులకు న్యాయం జరగలేదని తెలిపారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీల్లో ఒంటరి మహిళలు, పురుషులను ప్రత్యేక కుటుంబాలుగా గుర్తించకుండా అన్యాయం చేశారని పేర్కొన్నారు. ఈ విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వారికి అనుకూల తీర్పు వచ్చినప్పటికీ, కోర్టును ఆశ్రయించని అర్హులకు ఇప్పటికీ ప్యాకేజీలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.గత ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించుకున్నామని, ప్రస్తుత ప్రజాపాలనలోనూ ప్రజాప్రతినిధులు,అధికారులకు ప్రజాభవన్ నుంచి మండల రెవెన్యూ కార్యాలయం వరకు వినతిపత్రాలు అందించినా ఫలితం లేదన్నారు.ఇటీవల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి మూడు నెలల్లో నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ అమలు కాలేదని ఆరోపించారు.ఇప్పటికైనా నవంబర్ 19న సిద్దిపేటలో నిర్వహించనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి నిర్వాసితుల సమస్యలపై స్పందించి,సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు.సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే రాజకీయాలకు అతీతంగా మల్లన్న సాగర్ నిర్వాసితుల సమస్యల సాధన సమితి ఆధ్వర్యంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని బండ్ల స్వామి హెచ్చరించారు.ఈ సమావేశంలో మల్లన్న సాగర్ నిర్వాసితులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )